తమిళనాడు లో మంగళవారం నాడు ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సన్నిహితురాలు త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ ఉదయనిధి పై టీవీకే క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయన పై కేసు లు నమోదు అయ్యాయి. ఇదే కేసు లో మంగళవారం ఉదయమే పోలీస్ లు ఉదయనిధిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో పోలీస్ లు...డీఎంకే క్యాడర్ మధ్య ఘర్షణ జరిగింది. తంజావూరులో సోమవారం నాడు జరిగిన కావేరి జలాల నిరసన సభలో ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి విజయ్‌పై విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో కొందరు డీఎంకే కార్యకర్తలు ఒక్కసారిగా 'త్రిష.. త్రిష' అంటూ నినాదాలు చేశారు. దానికి ఉదయనిధి స్టాలిన్ నవ్వుతూ.. హీరోయిన్ త్రిష, సీఎం విజయ్‌లను ఉద్దేశించి అనుచితమైన డబుల్ మీనింగ్ కామెంట్లు చేశారు. ఉదయనిధి స్టాలిన్ కామెంట్లపై టీవీకే పార్టీ మహిళా విభాగం తంజావూర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తంజావూర్ పోలీసుల బృందం చెన్నై చేరుకొని మంగళవారం ఉదయం స్థానిక పోలీసుల సాయంతో చెన్నై నీలాంగరైలోని నివాసం వద్ద తంజావూర్ పోలీసులు ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన్ను తంజావూర్ తరలించారు. అంతకు ముందే ఈ కేసు లో తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఉదయనిధి మద్రాస్ హై కోర్ట్ ను ఆశ్రయించారు.
ఉదయనిధి అరెస్ట్ వార్తలతో తమిళనాడు లో ఒక్క సారి డీఎంకే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కొన్ని చోట్ల ముఖ్యమంత్రి విజయ్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. అదే సమయంలో డీఎంకే మాత్రం ఉదయనిధి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు అని..ఆయన తన ప్రసంగంలో ఎక్కడా త్రిష పేరు కూడా ప్రస్తావించలేదు అని వాదిస్తోంది. అరెస్ట్ పై స్పందించిన ఉదయనిధి ఇది ఒక జోక్ అని...దీన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటామన్నారు. బుధవారం నుంచి ప్రారంభం అయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పాల్గొనకుండా చేయటం కోసమే ఈ కుట్ర అంతా చేస్తున్నారు అని డీఎంకే ఆరోపిస్తోంది. బీజేపీ తో పాటు ఇతర రాజకీయ పార్టీలు...సెలెబ్రిటీలు ఉదయనిధి కామెంట్స్ ను తప్పుపడుతున్నారు. అయితే మద్రాస్ హై కోర్ట్ ఉదయానిధిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఆయన్ను ప్రశ్నించిన తర్వాత విడుదల చేయాలన్నారు. దీంతో స్టేషన్ బెయిల్ పై ఆయన విడుదల కానున్నారు. తమిళ నాడు ప్రభుత్వం కూడా ఆయన్ను కస్టడీ లో ఉంచే ఉద్దేశం లేదు అని వెల్లడించింది. దీంతో ఉదయనిధి స్టాలిన్ కు ఊరట దక్కినట్లు అయింది. పోలిసుల విచారణకు సహకరించాలని ఉదయనిధి స్టాలిన్ ను కోర్ట్ ఆదేశించింది.