శాంతి ఒప్పందం ఎప్పుడో!

Update: 2026-06-01 13:36 GMT

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై అదే అనిశ్చితి. ఇదిగో ఒప్పందం...అదిగో ఒప్పందం అంటూ వార్తలు రావటం తప్ప అసలు కార్యాచరణ మాత్రం ఉండటం లేదు. మరో వైపు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోడీ విషయంలో ఎలాంటి డైలాగులు చెప్పారో..ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అదే డైలాగులు చెపుతున్నారు. వాణిజ్య ఒప్పందం సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ గట్టిగా బేరాలు ఆడుతారు అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇరాన్ తో ఒప్పందం విషయంలో కూడా డోనాల్డ్ ట్రంప్ పదే పదే అదే డైలాగులు చెపుతున్నారు. శాంతి ఒప్పందానికి అంతా సిద్ధం అయింది అని చెపుతూ అమెరికా ఆత్మ రక్షణ కోసం అంటూ వరసగా ఇరాన్ పై దాడులు చేస్తోంది. అమెరికా దాడులకు ఇరాన్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తోంది. దీంతో మళ్ళీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదటికి వచ్చినట్లు అయింది.ఒక వైపు శాంతి చర్చలు కొనసాగుతున్న దశలో ఇరు దేశాలు తాజాగా పరస్పర దాడులకు దిగాయి.

                           ఇరాన్‌కు చెందిన రాడార్ వ్యవస్థలు, డ్రోన్ కమాండ్ కంట్రోల్ కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు నిర్వహించింది. దానికి ప్రతీకారంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్ జీసి) అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న తమ ఎమ్‌క్యూ-1 డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేయడం, ఇతర దుందుడుకు చర్యలకు ప్రతిస్పందనగానే తాము దాడులకు దిగినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ చెపుతోంది. ఇరాన్‌లోని గురుక్ నగరం, ఖేష్మ్ ద్వీపంలోని సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు తెలిపింది. తమ దాడిలో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, గ్రౌండ్ స్టేషన్, రెండు అటాక్ డ్రోన్లు ధ్వంసమైనట్టు పేర్కొంది. పూర్తిగా ఆత్మరక్షణ కోసమే ఈ దాడులు చేసినట్టు పేర్కొంది.

                                        తమ సైనిక కేంద్రాలపై దాడుల కోసం అమెరికా ఉపయోగించిన ఎయిర్‌బేస్‌ను తాము లక్ష్యంగా చేసుకున్నామని ఐఆర్‌జీసీ ప్రకటించింది . అమెరికా ఎయిర్‌బేస్‌పై ఐఆర్‌జీసీ ఏరోస్పేస్ ఫైటర్స్ దాడి చేశాయని వెల్లడించింది. అయితే ఏ దేశంలోని ఎయిర్‌బేస్‌పై దాడి జరిగిందో ఐఆర్‌జీసీ వెల్లడించలేదు. అయితే ఇరాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణులను కువైట్ ఎయిర్‌డిఫెన్స్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకున్నట్లు ప్రకటించింది. కారణాలు ఏమైనా కూడా అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా పలు గల్ఫ్ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరో వైపు ఇజ్రాయెల్ లెబనాన్ పై చేస్తున్న దాడులను ఖతార్ తీవ్రంగా ఖండించింది.

Tags:    

Similar News