డోనాల్డ్ ట్రంప్ కు అమెరికన్లు షాక్ ఇచ్చారు. రెండేళ్ల క్రితం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా) నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ రెండేళ్లలోనే అక్కడి ప్రజల విశ్వాసం కోల్పోయారు. ఇందుకు డోనాల్డ్ ట్రంప్ అనుసరించిన విధానాలే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లను గెలిపిస్తే ఓటర్లకు ఐదు వేల డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో 4 .75 లక్షలు ట్రంప్ డివిడెండ్ పేరుతో ఇస్తామని ప్రకటించినా కూడా ఈ హామీని ఎవరూ ప్రజలు పట్టించుకోలేదు. ఎందుకంటే ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ లు తలపెట్టిన యుద్ధం కారణంగా అమెరికా లో కూడా ఇంధన ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రతి సర్వే లోనూ అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఆమోద స్థాయి గణనీయంగా పతనం అవుతూ వచ్చింది. అమెరికా మిడ్స్ లో డోనాల్డ్ ట్రంప్ కు చుక్కెదురు తప్పదనే అంచనాలు మొదటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు అవే నిజం అయ్యాయి కూడా. ఈ ఫలితాలతో అమెరికా ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో...అంతకు మించి ఇరాన్ ప్రజలు కూడా రిపబ్లికన్ల ఓటమిపై ఫుల్ హ్యాపీగా ఉన్నారని చెప్పొచ్చు.
ఎందుకంటే ఇంతకు ముందు చేసినట్లు ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ తో పాటు ఏ దేశం పై అయినా తాను అనుకున్నదే తడవుగా యుద్ధం చేయటానికి ఛాన్సులు తగ్గుముఖం పడతాయి. దీనికి ప్రధాన కారణం ఈ మధ్యంతర ఎన్నికలతో రిపబ్లికన్లు అటు సెనెట్ తో పాటు యూఎస్ హౌస్ లో లో కూడా మెజారిటీ కోల్పోయారు. దీంతో డోనాల్డ్ ట్రంప్ రాబోయే రెండేళ్ల కాలంలో డెమోక్రాట్స్ తో కలిసి పని చేస్తే తప్ప..ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా పోతుంది. రెండు సభల్లోనూ ఇప్పుడు డెమోక్రాట్స్ కే పూర్తి మెజారిటీ వచ్చింది. తాజాగా వెలువడిన దారుణ ఫలితాలపై రిపబ్లికన్స్ మండిపడుతున్నారు. డోనాల్డ్ ట్రంప్ కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు డోనాల్డ్ ట్రంప్ మాత్రం బ్యాలట్ పేపర్లపై తన ఫోటో లేకపోవటం వల్లే ఓటమి వచ్చింది అని..తన ఎన్నికలు అయి ఉంటే ఫలితం మరోలా ఉండేది అని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత మళ్ళీ డెమాక్రాట్లతో కలిసి పనిచేస్తాని చెపుతున్నారు. మరో వైపు తమ ఓటమికి ఇరాన్ పై యుద్ధం కూడా ఒక కారణం అని అంగీకరించారు. అమెరికా మిడ్స్ ఫలితాలపై ఇరాన్ నేతలు స్పందించారు. యుద్ధం వద్దు అని అమెరికన్లు చెపుతున్నట్లు ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘెర్ ఘాలిబఫ్ వ్యాఖ్యానించారు. మరో వైపు ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ మాత్రం ఈ ఫలితాల వేళ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అన్నారు. ఒకవేళ అమెరికా దాడులకు దిగితే ఇరాన్ మరింత తీవ్రంగా స్పందిస్తుంది అన్నారు. అమెరికా లో మారిన లెక్కలతో ఇరాన్ తో యుద్దానికి డోనాల్డ్ ట్రంప్ ఎలాంటి ముగింపు ఇస్తాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. త్వరలో ఈ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకురాకపోతే అది మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం కూడా ఉంటుంది.