సుప్రీంకోర్టు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని ఆదేశించారు. షరతులతో బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. విచారణకు 24 గంటల ముందే నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. విచారణ సమయంలో సోషల్ మీడియా ముందు రావటం...మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వటం వంటివి చేయకూడదని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్నారు. ఈ కేసులో కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరంలేదని..స్టేట్ మెంట్లు అన్నీ రికార్డు అయి ఉన్నాయని పేర్కొంది. బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు రావటం తప్పేమీకాదని తెలిపింది. అంతకు ముందు ఆర్మీ ఆస్పత్రి నివేదిక, బెయిల్ పిటీషన్ అంశాలపై తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ఏపీసీఐడీ తరపున రఘురామకృష్ణరాజు కేసులో లాయర్ దుష్యంత్ దవే తన వాదనలు వినిపిస్తూ... ''ఆర్మీ ఆస్పత్రి నివేదిక అస్పష్టంగా ఉంది. లోతైన గాయాలున్నట్టు నివేదికలో పేర్కొనలేదన్నారు. రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్‌ను తక్షణం డిస్మిస్ చేయాలి. గుజరాత్ సొసైటీ కేసును దృష్టిలో ఉంచుకుని ఈ పిటిషన్‌ను కొట్టివేయాలి. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టును తప్పుపట్టకూడదు. నిజానికి తను చేసిన వ్యాఖ్యలపై రఘురామకృష్ణరాజు వెనక్కి తగ్గలేదు. రాజద్రోహానికి సంబంధించి మొత్తం 11 అంశాలు ఉన్నాయి. తప్పు జరిగిందా? లేదా? అనేదాన్నే కోర్టు పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
తన వ్యాఖ్యలతో రఘురామకృష్ణరాజు కులాల మధ్య చిచ్చుపెట్టే పని చేశారు. పార్లమెంటు సభ్యుడిగా, ఒక వ్యక్తిగా వర్గాల మధ్య చిచ్చు పెట్టారు. ఒక ఎంపీ చేసే వ్యాఖ్యలు ఇంకా ఎక్కువ తీవ్రత చూపిస్తాయి. కోవిడ్‌లాంటి ఆపత్కాలంలో ఘర్షణలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారు. ఆయన తప్పు సరిదిద్దుకుంటారని ప్రభుత్వం చాలా సమయం ఇచ్చింది. కానీ, రఘురామకృష్ణరాజు అన్ని పరిధులు దాటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ దశలో.. ఈ రాజద్రోహం కేసులో కోర్టు జోక్యం చేసుకోవద్దు'' అని న్యాయస్థానానికి విన్నవించారు. ఈ సందర్భంగా... సుప్రీంకోర్టుకు సీఐడి సీనియర్ అధికారి రిపోర్టును సమర్పించిన దవే.. ''రఘురామ వ్యాఖ్యలకు సంబంధించి 45 వీడియోలున్నాయి. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేశారు. ఒకరిని ఒకరు చంపుకొనే విధంగా రఘురామ మాట్లాడారు'' అంటూ రఘురామ రెచ్చగొట్టే వ్యాఖ్యలను కోర్టుకు చదివి వినిపించారు. అదే విధంగా... ''ఒక కులానికే వ్యాక్సినేషన్ చేస్తున్నారని రఘురామ తప్పుడు ప్రచారం చేశారు.
ప్రభుత్వ వాలంటీర్లను తన్నాలంటూ రఘురామ పిలుపునిచ్చారు. ఎంత పెద్ద పదవిలో ఉంటే అంత బాధ్యతగా ఉండాలని కోర్టు చెప్పింది. రఘురామకృష్ణరాజు ఎంపీ కాబట్టి బెయిల్ ఇవ్వాలని రోహత్గీ అంటున్నారు. 4 సార్లు ఎంపీ అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వలేమని 2017లో కోర్టు చెప్పింది. ఎంపీ అయినంత మాత్రాన హైకోర్టును దాటి సుప్రీంకోర్టుకు వస్తారా?'' అని తన వాదనలు వినిపించారు. కాగా రఘురామకృష్ణరాజును కస్టడీలో కొట్టారన్న ఆరోపణలు అవాస్తవమని ఇప్పటికే దవే కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే.
రఘురామకృష్ణంరాజు తరపున ముకుల్ రోహత్గీ వాదనలు విన్పిస్తూ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ కోసం రఘురామకృష్ణంరాజు పిటీషన్ దాఖలు చేసినందునే ఆయనపై కక్ష పెంచుకున్నారని కోర్టుకు తెలిపారు. దీనిపై దుష్యంత్ దవే అభ్యంతరం వ్యక్తం చేస్తూ..ఇందులో జగన్ ప్రతివాదిగా లేనందున ఆయన పేరు ప్రస్తావించటం సరికాదన్నారు. అయితే పిటీషనర్ గా తాను చెప్పాలనుకున్నది చెబుతానని రోహత్గీ వ్యాఖ్యానించారు. కేవలం బెయిల్ రాకుండా ఉండటం కోసమే రాజద్రోహం కేసు పెట్టారని తెలిపారు. సీఐడీ అదుపులో పోలీసులు చిత్రహింసలు పెట్టారనే అంశం ఆర్మీ ఆస్పత్రి నివేదికలో తేలిపోయిందని రోహత్గీ వాదించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.