కొత్త సుప్రీం లీడర్ గా మొజ్తబా ఖమేనీ

Update: 2026-03-09 14:55 GMT

అమెరికా ఎన్ని వార్నింగ్ లు ఇచ్చిన ఇరాన్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కొత్త ఇరాన్ సుప్రీం లీడర్ గా అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో హతం అయిన అయతుల్లా అలీ ఖొమైనీ తనయుడు మొజ్తబా ఖమేనీ ఎన్నికైనట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రకటన వచ్చిన తర్వాత అటు రష్యాతో పాటు చైనా కూడా స్పందించాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరాన్ కు పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు. టెహ్రాన్ కు మాస్కో అండగా ఉంటుంది అని...కొత్త సుప్రీం లీడర్ కు అయన అభినందనలు తెలిపారు. రష్యా తెర వెనక నుంచి ఇరాన్ కు సహకారం అందిస్తుంది అని వార్తలు వస్తున్న తరుణంలో పుతిన్ స్పందన కీలకంగా మారింది. చైనా కూడా ఈ విషయంపై స్పందించింది. ఇరాన్ కొత్త సుప్రీం గా మొజ్తబా ఖమేనీ ఎన్నిక ఆ దేశ అంతర్గత వ్యవహారం అని..అయితే ఆయన్ను టార్గెట్ చేసే ప్రయత్నాలను మాత్రం వ్యతిరేకిస్తామని స్పష్టం చైనా కూడా చేసింది. మొజ్తబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్ గా ఎన్నికైతే ఆయన్ను కూడా వదిలిపెట్టం అని అమెరికా కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రష్యా, చైనా ప్రకటనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇరాన్.. ఇప్పుడు ఖమేనీ తనయుడి నీడలో సరికొత్త యుద్ధ వ్యూహాలకు పదునుపెట్టే పనిలో ఉన్నట్లు చెపుతున్నారు.

                                                ఆయుధ సంపత్తిపరంగా..ఇతర విషయాల్లో ఎక్కడా కూడా అమెరికా తో తలపడలేని ఇరాన్ అరబ్ దేశాల్లో అమెరికా బేస్ లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు అనే సంకేతాలు అయితే పంపుతోంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఇటీవల జరిపిన దాడుల్లో చనిపోయిన అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడే. 88 మంది సభ్యులతో కూడిన 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' వర్చువల్ సమావేశంలో మొజ్తాబాను ఎన్నుకున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. మొజ్తబా ఖమేనీ గతంలో ఏ ప్రభుత్వ పదవి చేపట్టకపోయినప్పటికీ.. తెర వెనుక నుంచే ఇరాన్ అధికార యంత్రాంగాన్ని శాసిస్తున్నారనే ప్రచారం ఉంది. 2019లోనే అమెరికా ఆయనపై ఆంక్షలు విధించింది. ఆయనకు ఐఆర్‌జీసీ, ఇంటెలిజెన్స్ వంటి విభాగాలపై పూర్తి స్థాయిలో పట్టుంది.

                                               ఇరాన్‌లోని శక్తిమంతమైన సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్‌జీసీ)' ఒత్తిడి మేరకే ఈ నియామకం జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దేశాన్ని నడిపించడానికి భద్రతా వ్యవస్థలతో సన్నిహిత సంబంధాలున్న మొజ్తబాయే సరైన వ్యక్తని ఐఆర్‌జీసీ బలంగా నమ్ముతోంది. వాస్తవానికి గతంలో ఇరాన్ నాయకత్వం.. వారసత్వ పాలనను తీవ్రంగా వ్యతిరేకించేది. కానీ అసాధారణ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాత సిద్ధాంతాలను పక్కనపెట్టి ఖమేనీ కుమారుడికే పగ్గాలు అప్పగించినట్టు చెపుతున్నారు. తాజా పరిణామాలపై అమెరికా, ఇజ్రాయెల్ లు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఇరాన్ ప్రజల్లో కూడా కొంత అసంతృప్తి ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే సరైన నిర్ణయం అని ఎక్కువ మంది భావిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News

భారీ పతనం