సెన్సెక్స్ 1342 పాయింట్లు పతనం

Update: 2026-03-11 11:32 GMT

మార్కెట్లు మళ్ళీ పడ్డాయి. యుద్ధ భయాలు ఏ మాత్రం తొలగకపోవటంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగారు. తాజాగా నమోదు అయిన గరిష్ట ధరలతో పోలిస్తే ముడి చమురు ధర కొంత మేర తగ్గినా కూడా ఇదేమి మార్కెట్లకు ఊరట కల్పించలేకపోయింది. అమెరికా, ఇజ్రాయిల్ లు ఇరాన్ పై ఉమ్మడిగా చేస్తున్న యుద్ధం ఆగిపోతే తప్ప ఈ అనిశ్చితి తొలిగేలా లేదు అనే అభిప్రాయంతో ఎక్కువ మంది ఉన్నారు. దీంతో ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా చమురు ధరల పెరుగుదల రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణం అవుతుంది అనే భయాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు కూడా లేకపోవటంతో బుధవారం నాడు భారీ నష్టాలు నమోదు అయ్యాయి. బిఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1342 పాయింట్ల నష్టంతో 76863 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 395 పాయింట్ల నష్టంతో 23,866 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. బుధవారం మార్కెట్ ప్రారంభం అయినప్పటి నుంచి ఎక్కువ శాతం ఊగిసలాట కొనసాగింది.

                                        తర్వాత కీలక షేర్లు అన్నీ నష్టాల బాట పట్టడంతో సెన్సెక్స్ కూడా భారీగా నష్టపోయింది. ప్రధానంగా విదేశీ సంస్థ గత ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు పాల్పడ్డారు. ప్రధానంగా రాబోయే రోజుల్లో ఇంధన ధరలు పెరుగుతాయి అనే భయం మార్కెట్ లో ఉంది. యుద్దానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై పెద్ద ఎత్తున ఒత్తిడి పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ యుద్ధం నుంచి గౌరవప్రదమైన ఎగ్జిట్ కోసం అమెరికా తంటాలు పడుతున్నట్లు కనిపిస్తోంది. మరో వైపు ఇరాన్ మాత్రం తాము చర్చలకు అంగీకరించేది లేదు...ఎంత కాలం అయినా సరే యుద్దానికి రెడీ అంటూ కాలుదువ్వుతోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతోంది. ఇది అమెరికా కు మరింత ఇబ్బందికరంగా మారింది.

Tags:    

Similar News

భారీ పతనం