రష్యా-ఉక్రెయిన్ కొట్టుకోవటం ఏంటి?. వాళ్ల గొడవ కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్లో మదుపర్ల సంపద ఏకంగా ఐదే ఐదు రోజుల్లో 9.1 లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోవటం ఏమిటి?. ప్రపంచీకరణ కారణంగా వచ్చిన మార్పులే ఇవి. ప్రపంచీకరణ కారణంగా మార్కెట్లు అన్నీ అనుసంధానం అయిపోయాయి. దీంతో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ ప్రభావంపై భారత్ పైనే కాదు..వీటితో సంబంధం ఉన్న ప్రతి దేశం పైనా పడుతుంది. నేరుగా లేకపోయినా సరే ఏదో ఒక రూపంలో ఇది ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఫిబ్రవరి 16 నుంచి ఇప్పటి వరకూ అంటే ఐదు పని దినాల్లో బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 9.1 లక్షల కోట్ల రూపాయల మేర తుడిచిపెట్టుకుపోయింది. ప్రధానంగా మంగళవారం నాడు ప్రారంభంలోనే సెన్సెక్స్ ఏకంగా రెండు శాతం మేర నష్టోయింది. ప్రారంభం నుంచి మార్కెట్ లో పతనం కొనసాగుతూనే ఉంది. అన్ని విభాగాల సూచీలు నష్టాల్లో ఉన్నాయి.
ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ ల ఉద్రిక్తత కారణంగా క్రూడ్ ధర బ్యారెల్ కు 97 అమెరికన్ డాలర్లకు చేరింది. ఇది అంతిమంగా దేశ ఆర్ధిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపించటం ఖాయం అని అంచనా వేస్తున్నారు. క్రూడ్ ధరలు పెరిగితే ద్రవ్యోల్భణం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే ప్రపంచం అంతా కరోనా బారి నుంచి బయటపడుతున్న తరుణంలో వచ్చిపడిన ఈ సమస్య ఎటువైపు మళ్ళుతుందో అన్న టెన్షన్ అందరిలో ఉంది. అయితే ఈ కరెక్షన్ లో ఇన్వెస్టర్లు కొనుగోళ్ళకు మొగ్గుచూపుతారా లేక కొంత కాలం వేచిచూస్తారా అన్నదానిపైనే మార్కెట్ కదలికలు ఆధారపడి ఉంటాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులు ఇలాగే కొనసాగితే అతి పెద్ద ఎల్ ఐసీ ఐపీవో కూడా వాయిదా పడే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే జరిగితే సెంటిమెంట్ మరింత దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తున్నారు.
లక్ష