ఎన్నికల ముందు వరకు బీహార్ లో హోరా హోరి అని పోటీ అని ప్రచారం జరిగింది. కీలక పార్టీ లు ఎవరి స్టైల్ లో వాళ్ళు ప్రచారం నిర్వహించారు. తుది దశ పోలింగ్ కూడా మంగళవారం నాడు అంటే నవంబర్ 11 న ముగియటంతో ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసాయి. విచిత్రం ఏమిటి అంటే ఎన్నికల ముందు ప్రహకారానికి భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీయే కూటమికి అనుకూలంగా ఫలితాలు రాబోతున్నట్లు తేల్చాయి. ఆ సంస్థ ఈ సంస్థ అని ఏమీ లేకుండా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో ఒకటే మాట. మరో సారి బీహార్ లో ఎన్డీయే కూటమే అధికారంలోకి రానుంది అని. అసలు ఫలితాలు నవంబర్ 14 న వెల్లడికానున్నాయి. నితీష్ కుమార్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళా రోజ్‌గార్ యోజన పథకం కింద కోటి 25 లక్షల మంది మహిళలకు రూ.10 వేల నగదు పంపిణీ చేయడం ఎన్డీఏ భారీ మెజారిటీ సాధించడానికి కారణం కాబోతుంది అనే అంచనాలు ఉన్నాయి.
ఎన్డీయే కూటమికి 46.2 శాతం ఓట్లు, మహాఘట్ బంధన్ కు 37.9 శాతం, నూతనంగా స్థాపించిన జన్ సురాజ్ పార్టీకి 9.7 శాతం, ఇతరులకు 6.2 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ‘ప్లస్ ఆర్ మైనస్’ ఉండే అవకాశాలు ఉంటాయి అని పీపుల్స్ పూల్స్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. ఈ అంచనాల ప్రకారం బీహార్ లో బీజేపీ, జేడీయూ(యూ) నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నట్టు కనపడుతోంది. 243 స్థానాలు ఉన్న బీహార్ శాసనసభలో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 122 కాగా, ఎన్డీయే కూటమికి 133-159 స్థానాలు, మహాఘట్ బంధన్ కూటమికి 75-101 స్థానాలు, ఇతరులకు 2 నుంచి 8 స్థానాలు, నూతనంగా ప్రారంభించిన జన్ సురాజ్ పార్టీకి 0-5 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ తెలిపింది.
ఎన్డీయే కూటమిలోని బీజేపీ 63-70, జేడీయూ 55-62, ఎల్జేపీ (ఆర్వీ) 12-17, హామ్ 2-5, ఆర్ఎల్ఎం 1-4 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. మహాగట్ బంధన్ లోని ఆర్జేడీ 62-69, కాంగ్రెస్ 9-18, సీపీఐ(ఎంఎల్) 4-9 గెలిచే అవకాశాలున్నాయి. నూతనంగా స్థాపించిన జన్ సురాజ్ పార్టీ 0-5 స్థానాలు, ఏఐఎంఐఎం పార్టీ 0-2, సీపీఐఎంకి 0-3, వీఐపీకి 0-5, సీపీఐ 0-2, ఇతరులు 2-8 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది. బీజేపీకి 21.4 శాతం, ఆర్జేడీకి 23.3 శాతం, జేడీయూకి 17.6 శాతం, జన్ సురాజ్ పార్టీకి 9.7 శాతం, కాంగ్రెస్ పార్టీకి 8.7 శాతం, ఎల్జేపీకి 5 శాతం, ఇతరులకు 7.2 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని ప్రశ్నించినప్పుడు తేజశ్వీ యాదవ్ కి 32 శాతం మంది, నితీశ్ కుమార్ కి 30 శాతం, ప్రశాంత్ కిషోర్ కి 8 శాతం, చిరాగ్ పాశ్వాన్ కి 8 శాతం, సామ్రాట్ చౌదరికి 6 శాతం, రాజేశ్ కుమార్ కి 2 శాతం మద్దతిచ్చారు. అగ్రవర్ణాలు, ఎస్సీలు, ఎస్టీలు, ఈబీసీ వర్గాల మద్దతులో ఎన్డీయే ఆధిక్యంలో ఉండగా, ముస్లిం, బుద్ధిస్టులు, ఓబీసీ సామాజిక వర్గాల్లో అధికశాతం మంది మహాఘట్ బంధన్ వైపు ఉన్నారని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడయింది. 66.8 శాతం మహిళలు ఎన్డీయేకి మద్దతిస్తుండగా, మహాఘట్ బంధన్ కు కేవలం 24.8 శాతం ఓటర్లు మాత్రమే మద్దతిస్తున్నారు. ఇదే కాకుండా అన్నీ ఎగ్జిట్ పోల్స్ కూడా బీహార్ లో తిరిగి అధికారం దక్కించుకునేది ఎన్డీయే కూటమే అని తేల్చాయి.