స్టాక్ మార్కెట్ లో ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ గ్రో షేర్లు దుమ్మురేపుతున్నాయి. ఈ కంపెనీ మాతృ సంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ షేర్లు నవంబర్ 12 న మంచి ప్రీమియం తో నమోదు అయిన విషయం తెలిసిందే. లిస్టింగ్ దగ్గర నుంచి ఈ షేర్లు దూసుకెళుతూనే ఉన్నాయి. సోమవారం నాడు అంటే నవంబర్ 17 న ఏకంగా ఈ కంపెనీ షేర్లు 178 రూపాయల గరిష్ట స్థాయిని తాకాయి. చివరకు బిఎస్ఈ లో 26 రూపాయల లాభంతో 175 రూపాయల వద్ద క్లోజ్ అయ్యాయి. గ్రో షేర్ల ఆఫర్ ధర వంద రూపాయలతో పోలిస్తే ఇన్వెస్టర్లకు వారం రోజులు కూడా కాకముందే ఒక్కో షేర్ పై ఏకంగా 75 రూపాయల వరకు లాభం అందించినట్లు అయింది. ఈ కంపెనీ షేర్లు దూసుకెళ్లటంతో ఒకప్పుడు రైతు కొడుకు అయిన ఈ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన లలిత్ కెశ్రీ బిల్లియనీర్ల జాబితాలో చేరిపోయారు.
కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్ల రూపాయలను అధిగమించి 1,07,895 కోట్ల రూపాయలకు చేరింది. దీంతో ఇప్పుడు గ్రో షేర్ల దూకుడు హాట్ టాపిక్ గా మారింది అనే చెప్పాలి. 2025 సెప్టెంబర్ తో మూడు నెలల ఆర్థిక ఫలితాలను పరిగణనలోకి తీసుకోవటానికి బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ బోర్డు నవంబర్ 21 న సమావేశం కానుంది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజ్ లకు సమాచారం ఇచ్చింది. ఆర్థిక ఫలితాల తర్వాత ఈ దూకుడు ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం గ్రో షేర్ల దూకుడు చూసి గత ఏడాది బజాజ్ హౌజింగ్ ఫైనాన్స్ షేర్లు లిస్ట్ అయినప్పటి హడావుడి ని గుర్తు చేస్తున్నారు మార్కెట్ వర్గాలు. ఈ ఐపీవో కు కూడా ఎక్కడ లేని స్పందన వచ్చింది. ఈ కంపెనీ షేర్లు జీవిత కాల గరిష్ట ధర 188 రూపాయలు. 52 వారాల గరిష్ట ధర 148 రూపాయలు అయితే..కనిష్ట ధర 103 రూపాయలు గా ఉంది.
కంపెనీ 70 రూపాయల ధరతో షేర్లు జారీ చేసింది. ఇటీవల కంపెనీ వెల్లడించిన ఆర్థిక ఫలితాలు బాగానే ఉన్నా కూడా షేర్ ధర మాత్రం గత కొన్ని నెలల నుంచి 110 రూపాయల లోపు అటు ఇటు తన్నుకుంటుంది. అయితే ఒక్క సారి హడావుడి తగ్గితే గ్రో షేర్ల పరిస్థితి కూడా ఇలాగే కావొచ్చు అనే అంచనాలు ఉన్నాయి. ఐపీవో లో అలాట్ అయిన వాళ్ళు కొంత మేర లాభాలు స్వీకరిస్తే బెటర్ అని...త్వరలోనే కంపెనీ షేర్లు 125 నుంచి 130 రూపాయల వద్ద సెటిల్ అయ్యే అవకాశం ఉంది అని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. 80 రూపాయల వద్ద స్టాప్ లాస్ పెట్టుకోవాలని..కాకపోతే మార్కెట్ పొజిషన్ దృష్టి లో పెట్టుకుని ఈ షేర్ ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేస్తే దీర్ఘకాలంలో మంచి ప్రతిఫలాన్ని ఇవ్వొచ్చు అనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం 26 శాతం మార్కెట్ వాటా తో గ్రో దేశంలోనే నంబర్ వన్ స్టాక్ బ్రోకర్ కంపెనీగా ఉంది.