ఆదేశాలు ఇచ్చి వదిలేసిన డీజీసీఏ!

Update: 2025-12-05 12:54 GMT

దేశంలో విమాన ప్రయాణికులను అందరి మదిలో మెదులు తున్న ప్రశ్న ఇదే. విమానాలకు సాంకేతిక సమస్యలు రావటం..అప్పుడప్పుడు విమాన సర్వీసులు రద్దు అవటం సహజమే. కానీ ఏకంగా వందలో సంఖ్యలో విమానాలు ఆగిపోయి..లక్షల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన పరిస్థితి మాత్రం ఇదే మొదటి సారి అని చెప్పాలి. గతంలో దేశం ఎప్పుడూ కూడా ఇంత తీవ్రమైన సమస్యను ఎదుర్కోలేదు. కారణాలు ఏమైనా కూడా ఇది ఇప్పుడు కొత్త చర్చ కు కారణం అవుతోంది. ఇండిగో విమానాలు ఆగిపోతే..ఇండియాలోని విమానయాన రంగం కూడా ఇంచుమించు ఆగిపోయిన పరిస్థితి తలెత్తడం అంటే ఇది సీరియస్ గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇండిగో ఎయిర్ లైన్స్ దేశంలోనే అతి పెద్ద విమానయాన సంస్థగా ఉంది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఈ కంపెనీ మార్కెట్ వాటానే 60 శాతం వరకు ఉంది. ఇండిగో తర్వాత మరో కీలక ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా వాటా 26 శాతం వరకు ఉంది. అంటే ఇండియాలో దేశీయ విమాన ప్రయాణికులు పూర్తిగా రెండు ఎయిర్ లైన్స్ అంటే ఇండిగో..లేదా ఎయిర్ ఇండియా సర్వీసులపైనే ఆధారపడాల్సి ఉంది.

                                              స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ లైన్స్ వంటి ఎయిర్ లైన్స్ ఉన్నా కూడా వీటి విమానాల సంఖ్య తో పాటు మార్కెట్ వాటా కూడా పరిమితంగానే ఉంది అని చెప్పొచ్చు. ప్రస్తుత పరిస్థితికి ఇండిగో ఎంత కారణమో అదే సమయంలో ఈ మొత్తం వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన పౌరవిమానయాన శాఖ, డైరెక్టర్ జనరల్ అఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసిఏ) బాధ్యత కూడా ఉంది అని అధికారులు చెపుతున్నారు. ప్రస్తుతం దేశంలోని విమానాశ్రయాల్లో నెలకొన్న గందరగోళానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ (ఎఫ్ డీటిఎల్ ) విధానం అని చెపుతున్నారు. ఇది పైలట్ల పని గంటలు, సెలవులకు సంబంధించిన అంశం. 2025 నవంబర్ ఒకటి నుంచి ఈ నిబంధన కచ్చితంగా అమలు చేయాలని చెప్పిన డీజీసిఏ మరి ముందస్తుగా దేశంలో 86 శాతం వరకు మార్కెట్ వాటా కలిగి ఉన్న ఎయిర్ లైన్స్ ఎంత మేరకు దీనికి సిద్ధం అయ్యాయి....ఒక వేల కాకపోతే ఇందుకు అనుసరించాల్సిన ప్రత్యామ్యాయ మార్గాలు ఏంటి అనే విషయంపై ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు ఏ మాత్రం కనిపించటం లేదు. తీరా ఇండిగో విమానాల రద్దు తో దేశ వ్యాప్తంగా విమాన ప్రయాణికులు గగ్గోలు పెట్టే పరిస్థితి వచ్చిన తర్వాత తాపీగా డీజీసిఏ ఇప్పుడు మళ్ళీ ఇండిగో కు ఎఫ్ డిటిఎల్ అమలు విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అసలు ముందే కేంద్ర పౌర విమానయాన శాఖ ఇంతటి కీలక విషయంలో దేశంలోని ఎయిర్ లైన్స్ ఏ మేరకు సంసిద్దతో ఉన్నాయి అనే విషయంపై ఎక్కడ ముందస్తు సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేవు. తీరా ఇప్పుడు సమస్య తీవ్ర రూపం దాల్చిన తర్వాత రంగంలోకి దిగి ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త ఆదేశాలు జారీ చేస్తున్నారు.

                                                వరసగా రోజుల తరబడి దేశంలో ఇలా వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు అయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఇది ఎలాంటి సంకేతాలు పంపుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సమస్య ఇంత తీవ్ర రూపం దాల్చిన తర్వాత ఇప్పుడు కేంద్రం ఇండిగో సంక్షోభంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు ప్రకటించింది. ఈ సమస్యకు కారణం అయిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెపుతోంది. ఒక కీలక ఆదేశాలు ఇచ్చినప్పుడు అసలు సమస్యలు రాకుండా ముందే చూసుకోవాల్సిన ప్రభుత్వం అది వదిలేసి దేశ వ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు రద్దు అయిన తర్వాత ఇప్పుడు చర్యలకు ఉపక్రమిస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదనుగా పలు ఎయిర్ లైన్స్ విమాన టికెట్ రేట్లు అడ్డగోలుగా పెంచి ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి.

Tags:    

Similar News