Full ViewFull Viewవిమానాల్లో ఈ మధ్య విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితమే విమానంలో ఉండే ఇద్దరూ పైలట్లు ఫ్లైట్ ను ఆటోమోడ్ లో పెట్టి ఏకంగా 40 వేల అడుగుల ఎత్తున విమానం ప్రయాణిస్తుండగా గుర్రుపెట్టిపోయారు. ఇథియోఫియా విమానంలో ఈ ఘటన జరిగింది. ఏటీసీ ఎలర్ట్ లకు కూడా స్పందించని వీరు అటోమోడ్ గడువు ముగిసిన తర్వాత మోగిన అలారంతో ఉలిక్కిపడి మరీ లేశారు. వెంటనే తేరుకుని విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశారు. ఈ ఘటన మరవక ముందే మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. విమానంలో ఉండే పైలట్..కో పైలట్ లు ఏకంగా కాక్ పిట్ లోనే కొట్టుకున్నారు. ముష్టిఘాతాలకు దిగారు.
వీరి ఫైటింగ్ కు ఆపేందుకు విమాన సిబ్బంది రంగ ప్రవేశం చేసి..సర్దుబాటు చేశారు. మళ్లీ ఎక్కడైనా గొడవ పడతారేమో అన్న భయంతో సిబ్బంది ఒకరు వారితో పాటే కలసి కూర్చుకున్నారు. విషయం బయటకు రావటంతో వీరిపై సస్పెన్షన్ వేటుపడింది. ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జెనీవా నుంచి పారిస్ వెళుతున్న విమానంలో పైలట్లు ఇద్దరూ ఘర్షణకు దిగారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. పైలట్లు కొట్టుకున్నా విమానం సేఫ్ గా ల్యాండ్ కావటంతో అందులో ప్రయాణించిన ప్రయాణికులు మాత్రం బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు.