హర్ముజ్ జలసంధిలో ఇదే పరిస్థితి మరి కొన్ని రోజులు కొనసాగితే పలు దేశాల్లో విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే పలు ఎయిర్ లైన్స్ తమ తమ సర్వీసుల్లో భారీ ఎత్తున కోత విధించాయి. హర్ముజ్ జలసంధి నుంచి చమురు రవాణా నిలిచిపోవటంతో పలు దేశాల్లో విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) కొరత తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ విషయంలో ముఖ్యంగా యూరప్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. యూరప్ దగ్గర కేవలం ఐదు నుంచి ఆరు వారాలకు సరిపడా మాత్రమే ఏటీఎఫ్ నిల్వలు ఉన్నాయి అని..చమురు రవాణా సాధారణ స్థితికి చేరుకోకపోతే మాత్రం తీవ్ర సమస్యలు తప్పవు అని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) ఇటీవల హెచ్చరించింది. ఈ ప్రకటన వచ్చి కూడా ఇప్పటికే వారం రోజులు దాటింది.