కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సోమవారం నాడు దేశంలోని విమానయాన సంస్థల ముఖ్య అధికారులతో సమావేశం అయ్యారు. గత కొన్ని రోజులుగా దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానాలు భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొంటుండటంతో ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అతి తక్కువ వ్యవధిలో స్పైస్ జెట్ కు చెందిన విమానాలు కొన్ని తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నాయి. దీంతో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. తాజాగా ఇండిగో విమానాలు కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాయి. అదే సమయంలో ఇండిగో ఎయిర్ లైన్స్ సరైన ప్రమాణాలు పాటించటం లేదంటూ సాంకేతిక సిబ్బంది ఫిర్యాదులు చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఈ తరుణంలో కేంద్రపౌరవిమానయాన శాఖ మంత్రి సింధియా ఎయిర్ లైన్స్ చీఫ్ లతో విడివిడిగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా భద్రతా ప్రమాణాలపైనే చర్చ సాగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో ఎలాంటి రాజీలేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఆదేశించారు. ఎయిర్ లైన్స్ చీప్ లతో పాటు పౌరవిమానయాన శాఖకు చెందిన ఉన్నతాధికారులు, డీజీసీఏ అధికారులతో కూడా ఆయన సమావేశం అయ్యారు. ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ విషయంలో ఎలాంటి రాజీపడేదిలేదని తెలిపారు. సరైన చర్యలు చేపట్టి ఎయిర్ లైన్స్ విశ్వసనీయత పెంచుకోవాలన్నారు.