Full Viewఒక వైపు సెకండరీ మార్కెట్ లో అల్లకల్లోలం కొనసాగుతోంది. గత కొన్ని నెలలుగా మార్కెట్ లు భారీగా పతనం అవుతూ వస్తున్నాయి. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ లు మొదలు పెట్టిన యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరలు...ఎఫ్ఐఐ లు పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరించుకోవటం, ఏఐ స్పీడ్ తో ఐటి రంగంలో వచ్చిన గందరగోళ పరిస్థితులు...ఎల్ నినో కారణంగా వర్షాభావం ఇలా ఎన్నో కారణాలతో మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. మరో వైపు ప్రైమరీ మార్కెట్ లో మాత్రం జోష్ కొనసాగుతోంది. ఇది ఇప్పుడు పీక్ కు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియో ప్లాట్ ఫార్మ్స్ లిమిటెడ్ (జెపీఎల్) దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డు లను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఒక రికార్డు జియో పేరిట నమోదు అవ్వటం ఖాయం అయింది. దేశంలోనే అతి పెద్ద ఐపీవో గా ఇది నిలవనుంది. అక్టోబర్ 21 నుంచి మొదలయ్యే పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ 30213 కోట్ల రూపాయలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

                                        బుధవారం నుంచి ప్రారంభం అయ్యే ఈ కంపెనీ షేర్ల ధరలను 1065 -1119 రూపాయలుగా నిర్ణయించారు. శుక్రవారం నాడు అంటే అక్టోబర్ 23 న జియో ఐపీవో ముగియనుంది. ఈ షేర్లు అక్టోబర్ 28 న బిఎస్ఈ, ఎన్ఎస్ఈ ల్లో నమోదు కానున్నాయి. ఈ ఐపీవో కి యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన స్పందన చూస్తే బుధవారం నుంచి మొదలయ్యే ఇష్యూ కి స్పందన దుమ్మురేగిపోయే అవకాశాలు కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశంలోనే రిలయన్స్ జియో నంబర్ వన్ టెలికం కంపెనీగా ఉంది. ఈ సంస్థ మార్కెట్ వాటా 39 శాతం. రెండవ స్థానం భారతి ఎయిర్ టెల్ ది. ఇప్పటికే మార్కెట్ లో లిస్ట్ అయిన భారతి ఎయిర్ టెల్ షేర్లు సోమవారం నాడు బిఎస్ఈ లో 1872 రూపాయల వద్ద ముగిశాయి. ఈ లెక్కన చూసుకుంటే నంబర్ వన్ ప్లేస్ లో ఉన్న రిలయన్స్ జియో షేర్లు మార్కెట్ లో ఐపీవో ఆఫర్ గరిష్ట ధర 1119 కంటే మంచి ప్రీమియం తో నమోదు అయ్యే అవకాశం ఉంది అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

                                            ఎలా చూసుకున్నా కూడా భారతి ఎయిర్ టెల్ కంటే రిలయన్స్ జియో షేర్ల ధర ఎక్కువ ఉండటానికే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అలాట్ అయితే చాలు రిలయన్స్ జియో షేర్లు ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించే అవకాశం ఉంది అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఐపీవో ద్వారా సమీకరించే నిధుల్లో ఎక్కువ మొత్తాలను కంపెనీ తన అప్పులను తీర్చటానికి ఉపయోగించనుంది. దీంతో రాబోయే రోజుల్లో కంపెనీ లాభాలు మరింత పెరిగే అవకాశం ఉంది అని...లిస్టింగ్ ప్రాఫిట్స్ తో పాటు దీర్ఘకాలం లో జియో ప్లాట్ ఫార్మ్స్ లిమిటెడ్ (జె పీఎల్) మంచి ప్రతిఫలాన్ని ఇచ్చే అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్ల నుంచి దీనికి భారీ ఎత్తున డిమాండ్ వస్తుంది అనే అంచనాలు ఉన్నాయి. జియో ఐపీవో కింద రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 12  షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ హోల్డర్లకు 2500 కోట్ల రూపాయల విలువగల షేర్లను రిజర్వు చేశారు. ఐపీవో ద్వారా కంపెనీ మొత్తం 27 కోట్ల షేర్లను జారీ చేయనుంది. జియో ఐపీవో మొదలయ్యే ఫస్ట్ డే నుంచే కొత్త కొత్త రికార్డులు నమోదు అవుతాయనే అంచనాలు ఉన్నాయి.

Tags: