ఐఆర్ జీసి స్ట్రాంగ్ వార్నింగ్ !

Update: 2026-06-03 14:52 GMT

గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. తమ దేశంపై దాడికి గల్ఫ్ దేశాలు సహకరిస్తున్నాయనే ఆగ్రహంతో ఉన్న ఇరాన్ బుధవారం నాడు ఏకంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ వన్ పై డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో ఈ టెర్మినల్ దారుణంగా దెబ్బతినటంతో పాటు ప్రయాణికులు కూడా పెద్ద ఎత్తున గాయపడ్డారు. ఈ ఘటనలో ఒక భారతీయుడు కూడా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. చాలా మంది ప్రయాణీకులు...సిబ్బంది ఈ దాడుల్లో తీవ్ర గాయాలపాలు అయ్యారు. వీళ్లకు చికిత్స అందిస్తున్నారు. ఇరాన్ దాడితో ఎమర్జెన్సీ ప్రకటించి...కువైట్ ఎయిర్ పోర్ట్ లో విమానాల రాకపోకలను నిలిపివేశారు. కువైట్ వచ్చే విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. శాంతి ఒప్పందం అమల్లో ఉన్నా కూడా ఆత్మరక్షణ పేరుతో అమెరికా గత కొన్ని రోజుల నుంచి ఇరాన్ లోని కీలక ప్రాంతలపై దాడులు చేస్తోంది.

                                 అమెరికా దాడులకు దిగిన ప్రతిసారి ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. ఈ సారి ఏకంగా కువైట్ ఎయిర్ పోర్ట్ ను టార్గెట్ చేసింది. అమెరికా చేపట్టిన వైమానిక దాడులకు నిరసనగానే తాము కువైట్ ఎయిర్ పోర్ట్ పై దాడి చేసినట్లు ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్ జీసి) వెల్లడించింది. గల్ఫ్ దేశాలపై తమ దాడులు కొనసాగుతాయి అని కూడా ప్రకటించింది. దీంతో యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో అన్న టెన్షన్ నెలకొంది. ఇరాన్ దాడులతో కువైట్ తో పాటు బహ్రెయిన్ ప్రభుత్వాలు తమ దేశంలోని ప్రజలకు పలు సూచనలు చేశాయి. బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించాయి.

                                ఇరాన్ దాడుల కారణంతో మొత్తం కువైట్ ఎయిర్ పోర్ట్ లో 63 మంది గాయపడగా, వారిలో ఏడుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బాధితులకు నిరంతర వైద్య సేవలు అందించడానికి ఆరోగ్య రంగం పూర్తి సన్నద్ధతతో పనిచేస్తోందని తెలిపారు. ఇది ఇలా ఉంటే తనకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ని నేరుగా కలవాలి అని ఉంది అని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది అన్నారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు అని మరో సారి ప్రకటించారు. ఇందుకు ఇరాన్ కూడా అంగీకరించింది అని చెప్పుకొచ్చారు. అయినా సరే మరి ఎందుకు శాంతి ఒప్పందం తుది రూపు తీసుకోవటం లేదు అన్నది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్నగా మారింది. మరో వైపు డోనాల్డ్ ట్రంప్ చెప్పే మాటలను ఏ మాత్రం నమ్మటానికి లేదు అనే అభిప్రాయాన్ని కూడా కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ కూడా డోనాల్డ్ ట్రంప్ చెపుతున్న వాటిలో చాలా వరకు నిజాలు ఉండటం లేదు అని ఆరోపించిన సంగతి తెలిసిందే.

Full View

Tags:    

Similar News