అగ్రశ్రేణి ఐటి కంపెనీలు..దిగ్గజ సంస్థల సీఈవోల వేతనాలు ఓ రేంజ్ లో ఉంటాయనే విషయం తెలిసిందే. తాజాగా దేశంలోని ప్రముఖ ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ (ఐటి) కంపెనీ ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వేతనానికి సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. గతంతో పోలిస్తే ఆయన వేతనం ఏకంగా 88 శాతం మేర పెరిగి 79. 75 కోట్ల రూపాయలకు చేరింది. ఇన్ఫోసిస్ యాజమాన్యం సలీల్ పరేఖ్ ను మరో ఐదేళ్ల పాటు ఎండీ, సీఈవోగా కొనసాగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో బాగంగానే తాజాగా వేతనంలో కూడా ఈ మార్పులు చేశారు. మొత్తం వాటాదారులకు వస్తున్న రిటర్న్స్, మార్కెట్ క్యాప్ పెరుగుదల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వేతనం పెంపు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఏటా 80 కోట్ల రూపాయల వేతనం అంటే నెలకు దగ్గర దగ్గరగా 6.66 కోట్ల రూపాయలు అందుకుంటారన్నమాట. భారత్ లో అత్యధిక వేతనం తీసుకుంటున్న వారిలో ఆయన ఇప్పుడు ఒకరుగా నిలుస్తారు. కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించటమే కాకుండా..ఇంత భారీ వేతనం ఇవ్వటానికి గల కారణాలను కూడా గట్టిగా వివరించే ప్రయత్నం చేసింది. 2027 మార్చి 31 వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సలీల్ నాయకత్వంలో కంపెనీ వాటాదారులకు ఏకంగా 314 శాతం రిటర్న్స్ వచ్చాయని పేర్కొన్నారు.