Full Viewఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా ఐదు వేల కార్లు కొట్టేశాడు. మరి ఇక డబ్బుకు ఏమి కొదవ ఉంటది. ఏకంగా పది కోట్ల రూపాయల విలువ చేసే విల్లా కొన్నాడు. అంతే కాదు..సదరు కార్ల దొంగకు ముగ్గురు భార్యలు..ఏడుగురు పిల్లలు. దేశంలోనే ఇతగాడు అతిపెద్ద కారు దొంగగా పోలీసులు గుర్తించారు. ఈ దొంగ పేరు అనిల్ చౌహన్. ఈ కార్ల దొంగపై ఏకంగా 181 కేసులు ఉన్నాయి. అయితే ఈ దొంగ భార్యలు మాత్రం ఆయన కార్ డీలర్ అనుకున్నారంట. చివరకు పోలీసుల అరెస్ట్ తో అవాక్కవటం వారి వంతు అయింది. ఈశాన్య రాష్ట్రాల నుంచి ఆయన హాయిగా విమానాల్లో ఢిల్లీకి చేరుకుంటాడు. కార్ల దొంగతనం పని పూర్తి చేసుకుని మళ్లీ ఎంచక్కా విమానంలో చెక్కేస్తాడు. ఈ సారి ఢిల్లీ పోలీసులు వలపన్ని అరెస్ట్ చేశారు.
దీని కోసం వీరు మూడు నెలలుగా ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి మరీ కాపు కాశారు. 52 సంవత్సరాల విజయ్ చౌహన్ ఢిల్లీలో కొట్టేసిన కార్లను గ్యాంగ్ టక్, అస్సాం, నేపాల్ తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో విజయవంతంగా అమ్మేసేవాడు. ఈ డీల్స్ కోసం ఆయన ఏకంగా 25 నుంచి 30 మందితో టీమ్ లను ఏర్పాటు చేసుకున్నాడు. ఖరీదైన కార్లను దొంగతనం చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతూ ఓ పారిశ్రామికవేత్తలా కలరింగ్ ఇచ్చుకుంటూ తిరుగుతూ ఉన్నాడు..చివరకు పోలీసులకు చిక్కాడు. పోలీసుల చేతికి చిక్కిన తర్వాత ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు పది కోట్ల రూపాయల విలువ చేసే విల్లాను స్వాధీనం చేసుకున్నారు.