Full Viewపర్యాటకులకు శుభవార్త. హాంకాంగ్ పర్యాటక రంగాన్ని తిరిగి గాడినపెట్టేందుకు ఆ దేశ టూరిజం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా ఐదు లక్షల ఉచిత విమాన టిక్కెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే ఏ దేశానికి ఎన్ని టిక్కెట్లు దక్కుతాయి..ఈ ఉచిత టిక్కెట్ దక్కించుకోవాలంటే అనుసరించాల్సిన విధానం ఏమిటి అన్న విషయాలు త్వరలోనే హాంకాంగ్ టూరిజం బోర్డు వెల్లడించనుంది. ఎయిర్ లైన్స్ తో చర్చలు జరిపి ఎప్పుడు ఎన్ని టిక్కెట్లు కేటాయించవచ్చు..ఎలా కేటాయించాలి అన్న అంశంపై కసరత్తు సాగుతోంది. కరోనా కష్టకాలంలో హాంకాంగ్ ఎయిర్ లైన్స్ కు ఆర్ధికంగా సాయం అందించేందుకు ప్రభుత్వం అప్పుడే ఈ టిక్కెట్లను కొనుగోలు చేసి పెట్టింది. ఇప్పుడు వాటిని పర్యాటకులను ఆకర్షించేందుకు వాడనుంది. ఇతర దేశాలతో పోలిస్తే హాంకాంగ్ పర్యటన అంటే కాస్త ఖరీదైన వ్యవహారమే. అయితే హాంకాంగ్ కు ఉచిత విమాన టిక్కెట్ అంటే ఇది సహజంగా ఎవరైనా మొగ్గుచూపదగ్గ ఆఫర్ గానే భావించవచ్చు.
ముఖ్యంగా తరచూ విదేశాల్లో పర్యటించే అలవాటు ఉన్న వారికి అయితే ఇది లక్కీ ఛాన్స్ అన్నట్లే లెక్క. ప్రపంచంలో కరోనా నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేసిన దేశాల్లో హాంకాంగ్ ఒకటి. నిన్న మొన్నటివరకూ హాంకాంగ్ పర్యటించాలంటే క్వారంటైన్ తప్పనిసరి నిబంధన ఉంది. తాజాగానే ఈ నిబంధన ఎత్తేసి...పర్యాటకులను ఆకర్షించేందుకు మార్గం సుగమం చేసింది. ఈ ఉచిత విమాన టిక్కెట్ ఆఫర్ కూడా అందుబాటులోకి వస్తే ఆ దేశం తిరిగి పర్యాటకులతో కళకళలాడే ఛాన్స్ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హాంకాంగ్ కు పక్కనే ఉండే మకాక్ క్యాసినోలకు ఎంతో పేరుగాంచిన ప్రాంతం. అమెరికాలోని లాస్ వెగాస్ తర్వాత ప్రపంచంలోనే క్యాసినోలకు ఇది కీలక ప్రాంతంగా ఉంది. సహజంగా హాంకాంగ్ కు వెళ్ళిన వారెవరైనా మకావ్ వెళ్లకుండా రారంటే అతిశయోక్తి కాదేమో.