అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు విదేశీ విద్యార్థులు..హెచ్ 1 బీ వీసా హోల్డర్లపై ఇంకా కసి తీరినట్లు కనిపించటం లేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిబంధనలు తీసుకొచ్చి అందరిని గందరగోళంలో పడేయటం ఆయనకు అలవాటుగా మారింది. ముందు ఒక నిర్ణయం తీసుకోవటం...తర్వాత తూచ్ అనటం కూడా ఎన్నో సార్లు చేశారు. ప్రపంచ చరిత్రలోనే డోనాల్డ్ ట్రంప్ లాగా ఇలా పలు అంశాల్లో గందరగోళ నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు మరోకరు ఉండరనే చెప్పొచ్చు. అంతే కాదు ఆయన మాటలను ఏ మాత్రం నమ్మటానికి లేదు అన్నట్లు గా తయారు అయింది పరిస్థితి . దీనికి ప్రధాన కారణం డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాల్లో నిలకడ ఉండకపోవటమే. ఒక సారి హెచ్ 1 వీసాలపై కఠిన ఆంక్షలు అంటాడు. మరి సారి అమెరికా కు నిపుణలైన విదేశీ ఉద్యోగులు ఎంతో అవసరం ఉంది అని చెపుతాడు.
ఇలా తాను తీసుకున్న నిర్ణయాలను తానే కౌంటర్ ఇచ్చుకుంటూ స్టేట్మెంట్స్ ఇచ్చే వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్ అవుతారు అని బహుశా ఆ దేశ ప్రజలు ఎవరూ ఉహించి ఉండరు. ఇప్పుడు అమెరికా అధికారులు అనుసరిస్తున్న విధానం ఎంతో మంది ఉద్యోగులను గందరగోళంలోకి నెడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియా కు చెందిన ఎంతో మంది హెచ్1బి ఉద్యోగులకు ఇదిఏ మాత్రం మింగుడు పడని వార్త అనే చెప్పాలి. ఎందుకంటే ఉన్నఫళంగా ఇప్పుడు హెచ్1 బి, హెచ్4 వీసాల రీ షెడ్యూల్‌తో ఒక్కసారిగా భారతీయ ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. అమెరికానుంచి క్రిస్‌మస్, జనవరి సెలవుల సందర్భంగా హెచ్1బి వీసా స్టాంపింగ్‌కు ఇండియాకు వచ్చిన వేలాది మంది ఉద్యోగులకు షాక్ తగిలింది. రెండ్రోజుల క్రితం ఇండియాకు స్టాంపింగ్‌కు వచ్చిన ఉద్యోగుల వీసాలను అమెరికా కాన్సులేట్ రీ షెడ్యూల్ చేసింది. ఇంకా చేస్తూనే ఉంది.
తాజాగా ప్రకటించిన సమాచారం మేరకు డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 24వ తేదీ వరకూ ఉన్న వీసా స్లాట్‌లన్నీ మార్చి నెల ఆ పైకి పోస్ట్‌పోన్ చేసింది. వాస్తవానికి అమెరికాలో హెచ్1బి ఉద్యోగి ఇండియాకు రావాలంటే ఇక్కడ అమెరికన్ కాన్సులేట్‌లో విధిగా స్టాంపింగ్ వేయించుకోవాలి. తాజా నిబంధనల ప్రకారం దీనికి బయోమెట్రిక్, ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. దీనికోసం రెండు మాసాల ముందే స్లాట్‌లు బుక్ చేసుకుని ఇండియాకు వచ్చిన పలువురికి ఇక్కడికొచ్చాక రీషెడ్యూల్ వార్త తెలిసింది. హెచ్1బి వీసా ఉద్యోగులు ఇండియాకు వస్తే 60 రోజుల కంటే ఎక్కువ ఉండటానికి వీలు లేదు. అంతకంటే ఎక్కువ రోజులు ఉంటే తిరిగి అమెరికా వెళ్లడానికి వీలుండదు. ఇప్పుడు డిసెంబర్ 15 స్లాట్ ఉన్న వారికి మార్చి 25కు ఇచ్చారు. అంటే 100 రోజులు పైనే. దీంతో ఏం చేయాలో వారికి దిక్కు తెలియడం లేదు. అలాగే హెచ్4 వీసా అంటే హెచ్1బి మీద ఉన్నవారిమీద ఆధారపడి ఉండే కుటుంబ సభ్యులు, భార్య ఇలాంటి వారు కూడా స్టాపింగ్‌కోసం వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయారు.
రకరకాల కారణాలతో ఇక్కడికొచ్చి వీసా స్టాంపింగ్ కాకుండా ఇక్కడే ఉండిపోతే దిక్కుమిటి అంటూ లబో దిబోమంటున్నారు. స్టాంపింగ్‌కు రాకుండా అమెరికాలోనే ఉండేటట్టయితే మూడేళ్ల పాటు ఉండచ్చు. ఇండియాకు వచ్చి వెళ్లాలంటే ఖచ్చితంగా స్టాంపింగ్ ఉండాలి. సోషల్ మీడియా ఖాతాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వీరికి వీసా ఇవ్వాలనే నిబంధనతో ఇలా రీషెడ్యూల్ చేశారన్న వార్తలు వినిపిస్తున్నారు. ఇప్పటికీ ఇంకా అభ్యర్థులకు అమెరికన్ కాన్సులేట్‌ల నుంచి ఈమెయిల్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఇండియాకు వచ్చిన వారు ఎప్పడు మెయిల్ వస్తుందో, రీషెడ్యూల్ వార్త ఎప్పుడొస్తుందో నని బెంబేలెత్తుతున్నారు. చాలామంది మార్చి మాసంలో పెళ్లి చేసుకుందామనుకున్న జంటలు ఇక్కడ పెళ్లిమండపాలు కూడా బుక్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు వస్తే పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికానుంచి ఇక్కడకు స్టాపింగ్‌కు రాకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి కొంత మంది ఈ రీషెడ్యూలింగ్ గందరగోళం ముగిసే వరకు ఇండియా వైపు చూడటానికి కూడా ఆసక్తి చూపించటం లేదు.