Full Viewఫ్లై దుబాయ్ విమాన ఘటన విషయంలో ఇప్పుడే ఒక్కొక్కటి క్లారిటీ వస్తున్నాయి. విమానంలోని కాక్ పిట్ లో వీరోచితంగా పోరాడటమే కాకుండా వందల మంది ప్రాణాలను కాపాడిన భారత్ కు చెందిన పైలట్ స్మిత్ మచ్చార్‌ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. స్మిత్ మచ్చార్‌ పై దాడి చేసిన కో పైలట్ పేరుతో పాటు ఆయన గత చరిత్రకు సంబంధించిన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వీటి ప్రకారం చూస్తే కో పైలట్ కచ్చితంగా ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు ప్లాన్ వేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఆయన పై నిషేధం కూడా విధించారు. అలాంటి వ్యక్తికి ఫ్లై దుబాయ్ ఎయిర్ లైన్స్ కో పైలట్ బాధ్యతలు ఎలా అప్పగించింది అన్నది కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్మిత్ మచ్చార్‌పై దాడిచేయడంతో పాటు ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించిన కోపైలట్ పేరు హమామ్ అల్ హమామీ అని గుర్తించారు. అతడు ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి.

                                      తొలుత ఇండియన్ పైలట్ స్మిత్ మచ్చార్‌పై దాడిచేసి, విమానాన్ని తన స్వాధీనంలోకి తీసుకోవడానికి హమామీ పథకం పన్నాడు. ఈ ప్లాన్‌లో భాగంగానే మచ్చార్‌పై తీవ్రంగా దాడి చేశాడు. కానీ మచ్చార్ తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రతిఘటించడంతో హమామీ ప్లాన్ వికటించింది. 2024లో ఒమన్ ఎయిర్ కంపెనీలో అతను ట్రైనీ కోపైలట్‌గా పనిచేశాడు. ఆ సమయంలో అతను విధి నిర్వహణలో ఉండగా.. తీవ్రవాద భావజాలానికి సంబంధించిన మెటీరియల్ దొరికింది. దీంతో ఒమన్ ఎయిర్ కంపెనీ అతనిని ఉద్యోగం నుంచి తొలగించింది. కొంతకాలం తర్వాత అతనికి అదే సంస్థ వేరే బాధ్యతలు అప్పగించింది అని గుర్తించారు. అయితే భద్రతాపరమైన కారణాలను పేర్కొంటూ అతను విమానంలో ప్రయాణించకుండా కంపెనీ నిషేధం విధించింది. ప్రధానంగా తీవ్రవాద భావజాలాన్ని పెంపొందించుకోవడమే దీనికి కారణమని తెలిపింది.విధి నిర్వహణలో ఉన్నపుడు తీవ్రవాద భావజాలానికి సంబంధించిన మెటీరియల్ దొరకడంతో ఒమన్ ఎయిర్.. హమామీపై నిషేధం విధించింది. ఈ నిషేధం అమల్లో ఉన్నప్పటికీ.. ఫ్లైదుబాయ్ విమానయాన సంస్థ అతడిని ఉద్యోగంలో నియమించింది. యూఏఈ-ఇజ్రాయెల్ మధ్య విమానాన్ని నడిపేందుకు అతడికి అనుమతి ఇచ్చింది.

                                        ఈ సంస్థలో అతను 8 నెలల పాటు పనిచేశాడు. అంతకుముందు ఒమన్ ఎయిర్‌లో ఏడేళ్లు పనిచేశాడు. 2025 ఫిబ్రవరిలో ఒమన్ ఎయిర్‌కు రాజీనామా చేశాడు. అదే ఏడాది జూన్‌లో రాయల్ ఎయిర్ మారోక్‌లో చేరాడు. ఈ ఏడాది జనవరిలో ఆ సంస్థకు రాజీనామా చేసి ఫ్లైదుబాయ్‌లో చేరాడు. హమామీ తన జీవితంలో ఎక్కువ కాలం ఒమన్ బయటే గడిపాడు. ఒమన్‌ను వీడి వెళ్లిన తర్వాత అతను సిరియాలో ఉన్నాడు. అక్కడే తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. తర్వాత యూఏఈకి వెళ్లాడు. హమామ్ అల్ హమామీ తండ్రిది యూఏఈ కాగా.. తల్లిది సిరియా. ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై దాడి చేసిన ఘటనలో ప్రస్తుతం హమానీని సౌదీ అరేబియా నుంచి యూఏఈకి తరలించారు. ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడ అతనిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇజ్రాయెల్‌ను ఒమన్ సాధారణంగా గుర్తించదు. అలాంటిది ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న విమానంలో ఒక ఒమనీ పౌరుడిని ఎలా అనుమతించారన్న దానిపై సందేహాలు నెలకొన్నాయి. ఫ్లైదుబాయ్ విమాన సిబ్బందిలో హమానీ ఎలా చేరాడన్న వ్యవహారంపై ఇజ్రాయెలీ ఏజెన్సీలు షిన్ బెట్, మొసాద్‌తో పాటు మిలిటరీ, రవాణా మంత్రిత్వశాఖలు దర్యాప్తు చేస్తున్నాయి. హమామి సోషల్ మీడియా ఖాతాల్లో కూడా అనుమానాస్పద పోస్ట్ లు ఉన్నట్లు గుర్తించారు.

Tags: