అంతా బాగున్న ఐటి రిటర్న్స్ పోర్టల్ లో మార్పులు చేయాలని కేంద్రం నిర్ణయించింది.ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా తొలి విడత కింద 165 కోట్ల రూపాయలు వ్యయం చేసింది. కానీ ఇది ప్రారంభం నుంచి చుక్కలు చూపిస్తూనే ఉంది. అంతకు ముందు అత్యంత సాఫీగా సాగిన ఐటి రిటర్న్స్ ఫైలింగ్ ఇప్పుడు అత్యంత సంక్లిష్టంగా మారింది. ఎప్పుడో ఈ సమస్యలు గుర్తించినా ఇంత వరకూ అవి పరిష్కారం కాలేదు. గత రెండున్నర నెలలుగా ఇదే పరిస్థితి ఉంది. ఈ తరుణంలో కేంద్ర ఆర్ధిక శాఖ తాజాగా ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పారేఖ్ కు సమన్లు జారీ చేసింది. రెండున్నర నెలలు అయినా కూడా ఇంత వరకూ ఇందులోని సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేశారు.
ఆయన సోమవారం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం అయి వివరణ ఇవ్వాల్సి ఉంందని సమాచారం. గత కొద్ది రోజులుగా అసలు పోర్టల్ అందుబాటులో లేదు. ఈ కొత్త పోర్టల్ ను జూన్ 7న కేంద్రం ప్రారంభించింది. పన్ను చెల్లింపుదారుల నుంచి, పన్ను నిపుణుల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఇన్ఫోసిస్ కు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేసినా సమస్యలు ఇంత వరకూ పరిష్కారం కాలేదు. విచిత్రం ఏమిటంటే మరింత తేలిగ్గా ఐటి రిటర్న్స్ దాఖలుకు ఇది తీసుకొచ్చినట్లు కేంద్రం తెలిపింది. కానీ అందుకు భిన్నంగా ఇది మరింత సంక్లిష్టంగా మారింది.