కేంద్రం తాజాగా ఈ ఎయిర్ లైన్స్ ను వెనకేసుకు వచ్చింది. ఆ వెంటనే విమానయాన నియంత్రణా సంస్థ అయిన డీజీసీఏ స్పైస్ జెట్ కు షాకిచ్చింది. కేంద్రం ప్రకటనకు..డీజీసీఏ చర్యలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఓ వైపు సాంకేతిక సమస్యలతో పాటు స్పైస్ జెట్ తీవ్ర ఆర్ధిక సమస్యలను కూడా ఎదుర్కొంటోంది. ఇదే విషయాన్ని డీజీసీఏ తన మధ్యంతర ఆదేశాల్లో పేర్కొంది. సరైన విడి భాగాలు అందుబాటులో లేకపోవటం, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం తదితర అంశాల కారణంగా ప్రస్తుతం ఈ ఎయిర్‌లైన్స్ నడుపుతున్న విమాన సర్వీసుల్లో 50 శాతం సర్వీసులకు కోత వేసింది. ఎనిమిది వారాల పాటు ఈ ఆదేశాలు అమల్లో ఉండబోతున్నాయి. గత ఏప్రిల్ 1 నుంచి జూలై 5 వరకూ అనేక మార్లు స్పైస్ జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తిన నేపథ్యంలో డీజీసీఏ ఈ ఆదేశాలు జారీ చేసింది.'పలుమార్లు స్పాట్ చెక్‌లు, తనిఖీలు జరిపాం. మేము ఇచ్చిన షోకాజ్ నోటీసుకు స్పైస్‌జెట్ సమర్పించిన సమాధానం కూడా పరిశీలించాం.
ఈ నేపథ్యంలో స్పైస్‌జెట్ ప్రస్తుతం నడుపుతున్న విమానాల్లో కేవలం 50 శాతం విమాన సర్వీసులకు పరిమితం చేయాలని నిర్ణయించాం'' అని డీజీసీఏ ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. సురక్షితమైన, సమర్ధవంతమైన, విశ్వసనీయమైన ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ గా నిరూపించుకోవడంలో స్పైస్‌జెట్ విఫలమైందని పేర్కొంది. గత 18 రోజుల్లో కనీసం 8 సార్లు స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఈ ఎనిమిది వారాల సమయంలో స్పైస్‌జైట్ ఎయిర్‌లైన్స్ సాంకేతకంగా, ఇతర అంశాల పరంగా తమ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. స్పైస్ జెట్ కు క్యాష్ అండ్ క్యారీ ప్రాతిపదికనే వెండర్స్ ఎయిర్ లైన్స్ కు అవసరమైన విడిభాగాలు..ఇతర పరికరాలు సరఫరా చేస్తున్నాయి. విమానాశ్రయ ఆపరేటర్లు కూడా ఇదే పద్దతిని అమలు చేస్తున్నారు.