గత కొన్ని సంవత్సరాలుగా ఐటి రంగంలో పెద్ద ఎత్తున సాగుతున్న ఉద్యోగాల కోత. మరో వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంపెనీల నుంచి వస్తున్న కొత్త కొత్త టూల్స్. వీటితో దిగ్గజ ఐటి కంపెనీలు కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. రాబోయే రోజుల్లో ఈ ఏఐ టూల్స్ వల్ల ఐటి కంపెనీలకు వచ్చే ఆర్డర్లు తగ్గుతాయి అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అందుకే స్టాక్ మార్కెట్ లో సైతం దిగ్గజ ఐటి రంగ కంపెనీల షేర్లు కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఐటి రంగానికి ...దేశంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో దగ్గర సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ఐటి రంగంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా దేశీయ రియల్ ఎస్టేట్ రంగం మరికొంత కాలం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవటం ఖాయం అనే అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది మొదటి ఆరునెలల కాలంలో దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ లోకి వచ్చిన సంస్థాగత పెట్టుబడుల మొత్తం 42750 కోట్ల రూపాయలు. గత ఆరేళ్ళ కాలంలో ఇంత భారీ మొత్తంలో పెట్టుబడులు రావటం ఇదే మొదటి సారి.
అయితే ఇందులో ఎక్కువ మొత్తాలు ఆఫీస్ స్పేస్ రంగానికి వెళ్ళటం విశేషం. అదే సమయంలో రెసిడెన్షియల్ విభాగంలో పెట్టుబడులు ఈ ఆరు నెలల కాలంలోనే 40 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో వచ్చిన పెట్టుబడుల్లో ఎక్కువ మొత్తం టయర్ వన్ సిటీలు అయిన చెన్నై, బెంగుళూరు లు సాధించినట్లు నివేదికలు చెపుతున్నాయి. ముఖ్యంగా దేశీయ మార్కెట్ లో ప్రీమియం సెగ్మెంట్ లో జోరు కొనసాగుతున్నా కూడా అందుబాటు గృహాల విషయంలో మాత్రం డౌన్ ట్రెండ్ అలా కొనసాగుతూనే ఉంది. మరో వైపు దేశంలో ఐటి హబ్ లు గా పేరున్న బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో రెసిడెన్షియల్ అమ్మకాలు కొంత తగ్గుముఖం పట్టినట్లు నివేదికలు చెపుతున్నాయి. ఈ తరుణంలో చైనా రియల్ ఎస్టేట్ మార్కెట్ కొత్త కనిష్ఠాలకు చేరినట్లు వార్తలు వచ్చాయి. గత కొన్ని సంవత్సరాలుగా చైనాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఇది మరింత పతనం అయింది. అది ఎంతలా అంటే గత ఇరవై సంవత్సరాల్లో ఈ మార్కెట్ లో నమోదు అయిన పెరుగుదల అంతా తుడిచిపెట్టుకుపోయింది.
చైనాలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరలు 2006 సంవత్సరం నాటి స్థాయికి పతనం అయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చరిత్రలో ఎప్పుడూ ఎదుర్కొని సంక్షోభాన్ని చైనా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు ఎదుర్కొంటోంది. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ (BIS) విడుదల చేసిన, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రచురించిన గణాంకాల ప్రకారం 2026 తొలి మూడు నెలల కాలంలో చైనా నివాస గృహాల వాస్తవ ధరల సూచీ 85.13గా నమోదైంది. ఇది 2021లో నమోదైన సుమారు 113 గరిష్ఠ స్థాయి నుంచి భారీగా పడిపోయింది. చైనాలోని 70 ప్రధాన నగరాల్లో కొత్త ఇళ్ల ధరలు మే నెలలో గత ఏడాదితో పోలిస్తే 3.5 శాతం తగ్గాయి. గత 35 నెలలుగా ఈ ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. 2025 మే తర్వాత అత్యంత వేగంగా నమోదైన తగ్గుదల ఇదే కావటం విశేషం. సెకండరీ మార్కెట్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. చైనా ఇండెక్స్ అకాడమీ గణాంకాల ప్రకారం, 2026 జూన్‌లో దేశంలోని 100 ప్రధాన నగరాల్లో పాత ఇళ్ల రీ-సేల్ ధరలు నెలవారీ ప్రాతిపదికన 0.42 శాతం తగ్గాయి. వీటిలో 88 నగరాల్లో ధరలు పడిపోగా, కేవలం 12 నగరాల్లో మాత్రమే పెరుగుదల నమోదైంది. చైనా కుటుంబాల ఆస్తుల్లో రియల్ ఎస్టేట్‌కు అత్యంత కీలక స్థానం ఉండటంతో ఈ పతనం భారీ స్థాయిలో సంపద నష్టానికి దారితీసింది. పట్టణ ప్రాంతాల కుటుంబాల మొత్తం ఆస్తుల్లో సుమారు 70 శాతం నివాస గృహాలే ఉండటం గమనార్హం.
ఇది అమెరికాతో పోలిస్తే చాలా ఎక్కువ అని నిపుణులు చెపుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడం చైనా ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. గోల్డ్‌మన్ సాక్స్ అంచనా ప్రకారం, 2024, 2025 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ సంక్షోభం వల్ల వార్షిక జీడీపీ వృద్ధిరేటు సుమారు రెండు శాతం పాయింట్లు తగ్గింది. అలాగే 2025లో మాత్రమే రియల్ ఎస్టేట్ పెట్టుబడులు 17.2 శాతం తగ్గుముఖం పట్టాయి. ఈ సంక్షోభం చైనాలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలను కూడా దెబ్బతీసింది. సుమారు 300 బిలియన్ డాలర్ల అప్పులతో ఎవర్‌గ్రాండ్ లిక్విడేషన్‌ను ఎదుర్కొంటుండగా, ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద గృహ నిర్మాణ సంస్థగా ఉన్న కంట్రీ గార్డెన్ తన డాలర్ బాండ్లపై డిఫాల్ట్ అయింది. 2026లో నివాస సముదాయాల ధరలు మరో 4 శాతం వరకు తగ్గి, 2027లో స్థిరపడిన తర్వాత 2028లో మాత్రమే స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేశారు.