పోలీసుల తీరుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం నాడు ఏపీ డీజీపీకి ఓ లేఖ రాశారు. ప్రజలు, పార్టీ నేతల ప్రాధమిక హక్కులను హరించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని..ఇది ఏ మాత్రం మంచిపద్దతి కాదని తన లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొందరు పోలీసు అధికారులు శాంతి భద్రతల బాధ్యతలు పక్కన పెట్టి, అధికార పార్టీ పెద్దల మెప్పు కోసం, కేవలం ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టే పనిలోనే నిమగ్నమై ఉన్నారని ఆరోపించారు. ఫలితంగా నిత్యం హత్యలు, అత్యాచారాల వంటి నేరాలు పెరిగిపోయి ప్రజలు భయం గుప్పిట రోజులు గడుపుతున్నారు. ప్రభుత్వం ఇష్టానుసారం పన్నులు పెంచేసి ప్రజల నెత్తిన ధరల భారం మోపినప్పుడు ప్రజల తరపున నిరసన తెలిపే హక్కు ప్రతిపక్ష నేతలకు లేదా? అని ప్రశ్నించారు.
తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చినందుకు తెలుగుదేశం నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడం దారుణం అని విమర్శించారు. పక్క జిల్లాలో పెళ్లి వేడుకలో ఉన్న చింతమనేని ప్రభాకర్ ను అక్కడికి వెళ్ళి మరీ అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది? పోలీసుల ఈ దుందుడుకు చర్యలు ప్రజల్లో ఆ శాఖపై ఉన్న భరోసాను దెబ్బతీయదా? అని ప్రశ్నించారు. పోలీసుల తీరు ఓ బ్లాక్ మార్క్ గా మిగిలిపోయే అవకాశం ఉందన్నారు.