మూడేళ్ల కాలంలోనే అదానీ గ్రూపునకు చెందిన ఏడు లిస్టెడ్ కంపెనీలు మదుపర్ల సంపదను ఏకంగా 18.7 లక్షల కోట్ల రూపాయల మేర పెంచాయి. 2019 చివరి నాటికి ఈ గ్రూపు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కేవలం రెండు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. ఈ సంస్థ సగటున నెలకు మదుపర్ల సంపదను 56,700 కోట్ల రూపాయలు మేర పెంచింది. గత కొంత కాలంగా అదానీ పలు నూతన రంగాల్లోకి అడుగు పెట్టి భారీ పెట్టుబడులతో హవా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా విమానాశ్రయాల నిర్వహణ రంగంలోకి అడుగుపెట్టి జీవీకె నుంచి ప్రతిష్టాత్మకమైన ముంబయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేజిక్కించుకుంది. దీంతోపాటు ఏఏఐ నిర్వహణలో ఉన్న పలు విమానాశ్రయాల నిర్వహణ బాధ్యతను కూడా చేపట్టి..ఈ రంగంలోనూ తన సత్తా చాటుతోంది. అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో ఇటీవల మూడు నుంచి ఏకంగా రెండవ స్థానానికి చేరిన విషయం తెలిసిందే.