ఐఏఎస్ ల పిల్లలు ..ఐఏఎస్ లు ..డాక్టర్ల పిల్లలు డాక్టర్లు. యాక్టర్ల పిల్లలు యాక్టర్లు. ఇలా కీలక సర్వీసులు..వివిధ విభాగాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం తమ పిల్లలను కూడా ఆయా సర్వీస్ ల్లో చేర్చటానికి ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని సార్లు పిల్లలు కూడా తల్లి దండ్రుల ప్రొఫెషన్స్ చూసి అటు వైపు ఆకర్షితులు అవుతుంటారు. ఇందులో చాలా వరకు సక్సెస్ అయిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఒక సంచలన సర్వే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇండియాలో ప్రస్తుతం 91 శాతం మంది డాక్టర్లు తమ పిల్లలను ఈ ప్రొఫెషన్ లోకి పంపాలని అనుకోవటం లేదు. దేబబ్రత మిటాలీ ఆరో ఫౌండేషన్ గత ఆరు నెలలుగా నిర్వహించిన సర్వే లో ఈ విషయం వెలుగు చూసింది. ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలతో పాటు చిన్న పట్టణాల్లో ఉన్న 1200 మంది ఫిజీషియన్స్ అభిప్రాయాలు తీసుకుని ఈ నివేదిక సిద్ధం చేశారు.
ప్రభుత్వ సేవల్లో ఉన్న వాళ్ళతో పాటు ప్రైవేట్ రంగంలోని డాక్టర్ల అభిప్రాయాలు తీసుకుని ఈ నివేదిక సిద్ధం చేశారు. దాడుల భయంతో పాటు న్యాయపరమైన, భావోద్వేగ ఒత్తిళ్లు, రోజులో ఎక్కువ సమయం హాస్పిటల్స్ లోనే ఉండటం వల్ల ఎదురయ్యే ఒత్తిళ్లు వంటి అంశాలను ఎక్కువ మంది ప్రస్తావించారు. అదే సమయంలో చాలా మంది పని ఒత్తిడి కారణంతో తీవ్ర నిరాశలోకి వెళ్లటం...వారి నైపుణ్యాలపై కూడా ప్రభావం చూపుతుంది అని వెల్లడించారు. వీటితో పాటు డాక్టర్లు ఎక్కువ మంది లీగల్ కేసు లు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. 67 శాతం మంది డాక్టర్లు తమ కెరీర్ లో కనీసం ఒక్క మెడికో లీగల్ కేసు అయినా ఎదుర్కోవాల్సి వస్తోంది అని నివేదికలో పేర్కొన్నారు. రకరకాల కారణాలతో ఎక్కువ మంది డాక్టర్లు ఇప్పుడు తమ పిల్లలకు ఈ ప్రొఫెషన్ ను సూచించటం లేదు. ఎక్కువ పని గంటలు, రాత్రి షిఫ్ట్‌లు, తరచుగా ఆన్-కాల్ డ్యూటీలు వంటి కారణాలతో కుటుంబ జీవితంపై ప్రభావం పడుతోంది అని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. చాలా మంది డాక్టర్లు పని ఒత్తిడి కారణంతో దీర్ఘకాలిక నిద్ర లేమి, కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం గురించి నివేదించారు.
మరో ప్రమాదకరమైన పరిణామం ఏంటి అంటే ఫీజీషియన్స్ పై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది అని పది మందిలో ఆరుగురు తెలిపారు. తాజాగా డాక్టర్లు వెల్లడించిన అభిప్రాయాల ప్రకారం వాళ్ళు తమ పిల్లలను ఈ ప్రొఫెషన్ వైపు పంపక పోతే ఈ రంగంలో నిపుణుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది అని చెపుతున్నారు. ముఖ్యంగా హై స్పెషాలిటీ తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పోస్టింగ్ ల విషయంలో సమస్యలు వస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైద్య రంగంలో సంస్కరణలు తీసుకురావటం ద్వారా పరిస్థితుల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెపుతున్నారు. లేక పోతే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.