విశాఖలో పరిపాలనా రాజధాని రాదని స్వయంగా సీఎం జగన్ కేబినెట్ లోని మంత్రులు..ఎమ్మెల్యేలు కూడా భావిస్తున్నారా?. లేక సీఎం జగన్ మాటలను వారు కూడా నమ్మటం లేదా?. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎవరికైనా ఇదే అనుమానం కలగటం సహజం. సీఎం జగన్, వైసీపీ సర్కారు పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులకు నిర్ణయం తీసుకుంది. ఇదే జగన్ అసెంబ్లీ వేదికగా ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం ఇష్టంలేకనే అమరావతి రాజధానికి అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మాట మార్చి మూడు రాజధానులు అన్న విషయం తెలిసిందే. మూడు రాజధానుల బిల్లులు చెల్లుబాటు కాదని హైకోర్టు తేల్చిచెప్పింది...సర్కారు చాలా తాపీగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు ఈ విషయం తేలాల్సింది సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో అప్పీల్ కు ముందు..హైకోర్టు మూడు రాజధానుల బిల్లు చెల్లుబాటు కాదని చెప్పినా తర్వాత కూడా వైసీపీ మంత్రులు తమ విధానం పరిపాలనా వికేంద్రీకరణే అన్నారు. ఇటీవల అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ కూడా ఇదే మాటకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. మరి 151 మంది ఎమ్మెల్యేలతో అత్యంత శక్తివంతంగా ఉన్న వైసీపీ ఏ నిర్ణయం అయినా తీసుకుని అమలు చేయగల స్థితిలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా ప్రకటనలు ఎందుకు చేస్తున్నట్లు?. స్వయంగా మంత్రి ధర్మాన లాంటి వారు కూడా జగన్ అనుమతిస్తే రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొంటానని ప్రకటించటం వెనక మతలబు ఏమిటి?. జగన్ చేయను అంటే కదా సమస్య. స్వయంగా ఓ వైపు ప్రభుత్వం.. మరో వైపు అమరావతి ప్రాంతానికి చెందిన మంత్రులు కూడా మూడు రాజధానులే తమ విధానం అని చెబుతుంటే అధికార వైసీపీ మంత్రులు..ఎమ్మెల్యేలు షరతులతో రాజీనామా చేయటం..జగన్ ఆమోదిస్తే రాజీనామాలు చేస్తామని చెబుతుండంతో ఇది అంతా రాజకీయ డ్రామా అని తేలిపోతుంది.
అత్యంత కీలకమైన విశాఖ ఇన్ ఛార్జి, టీటీడీ ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి కూడా స్వయంగా మీడియా ముందుకు వచ్చి రాజకీయాలకు అతీతంగా ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సాధనకు రాజకీయేతర జెఏసీ ఏర్పడుతుందని ప్రకటించారు. రాజకీయేతర జెఏసీ ప్రకటన వైసీపీలో కీలక నేతగా ఉన్న వై వీ సుబ్బారెడ్డి చెప్పటంతో అది రాజకీయేతర జెఏసీ ఎలా అవుతుంది. రాజధాని ఏర్పాటు విషయంలో అమరావతి అని నిర్ణయం తీసుకున్నా..వైజాగ్ అని తీసుకున్నా ఖచ్చితంగా ఎంతో కొంత మంది లబ్దిపొందుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందులో అధికార పార్టీకి చెందిన వారు కూడా ఉంటారు. వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనికి ఏ పార్టీ పెద్దగా మినహాయింపు ఏమీ కాదు. అమరావతి రైతుల పాదయాత్రకు అధికార వైసీపీ ఎందుకు అంత ఆగమాగం అవుతుంది అన్నది ఇప్పుడు వైసీపీ చర్యలతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నో డౌట్ టీడీపీతోపాటు బిజెపి, జనసేన, ఆ ప్రాంత రైతులు కూడా అమరావతిలోనే ముందు ప్రకటించినట్లు పూర్తి స్థాయి రాజధాని కోరుకుంటున్నారు. రైతుల పాదయాత్రను అడ్డం పెట్టుకుని వైసీపీ ఉత్తరాంధ్ర లో తమ పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. అందుకే మంత్రులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. అయితే నిర్ణయాలు చేయాల్సిన స్థానంలో ఉన్న వారే రాజీనామాలు చేస్తామంటే అది ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతుంది అన్నది కూడా కీలకం కానుంది. అంతేకాదు..చంద్రబాబు అడ్డుకుంటే వైజాగ్ కు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తేలేకపోయామని అధికారంలో ఉన్న వైసీపీ నేతలు చెపితే ఈ మాటలను కనీసం ఆ ప్రాంత ప్రజలు అయినా నమ్ముతారా?. అధికార వైసీపీకి ఇంత కంటే అవమానం మరొకటి ఉంటుందా?.