టీఆర్ఎస్ ప్లీనరీలో తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఏపీలో కూడా టీఆర్ఎస్ పెట్టమంటున్నారు. మా పథకాలు అమలు చేయమని కోరుతున్నారు. మాకు అక్కడ నుంచి కూడా ఆహ్వానాలు అందుతున్నాయి ' అని వ్యాఖ్యానించారు. నిజానికి కెసీఆర్ ను ఎవరు పిలిచారో..ఎవరు ఏమి అడిగారో తెలియదు కానీ..ఆయన ఈ మాటలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అంతే కాదు..రాష్ట్రం వస్తే తెలంగాణలో కరెంట్ ఉండదని ప్రచారం చేశారని.కానీ ఏపీలో విద్యుత్ కోతలు ఉంటే తెలంగాణ 24 గంటల విద్యుత్ ఉందని ప్రకటించారు. కెసీఆర్ వ్యాఖ్యలు అన్నీ సీఎం జగన్ పాలనను చులకన చేసేవే.దేశంలోనే ఎవరూ చేయనిరీతిలో తాము సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం జగన్ పదే పదే ప్రకటిస్తున్నారు. అలాంటిది జగన్ నుకాదని..ఎవరు కెసీఆర్ ను పార్టీ పెట్టమని అడుగుతున్నారు...ఎవరు తెలంగాణ పథకాలు కోరుకుంటున్నారు అన్నది ఆసక్తికర పరిణామం. మామూలుగా అయితే చంద్రబాబునాయుడో లేక టీడీపీ నేతలో ఏదైనా విమర్శలు చేస్తే వైసీపీ నేతలు వెంటనే కౌంటర్ ఎటాక్ చేస్తారు. కానీ కెసీఆర్ బహిరంగంగా ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ పాలనను చాలా తేలిక చేసే మాటలు మాట్లాడినా కెసీఆర్ మాటలను ఖండించేంత బీపీ కానీ..కోపం కానీ ఏపీలో అధికార పార్టీ నేతలకు రాకపోవటం విశేషం.
అంతే కాదు...వైసీపీ అయితే జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు వెల్లడైన తర్వాత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అంతరాష్ట్ర సంబంధాలు..జలవివాదాలు వంటివి ఉండకూడదనే తెలంగాణలో పార్టీని పునరుద్ధరించకూడదని చాలా క్లారిటీతో నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. కానీ ఇప్పుడు కెసీఆర్ ఏమో ఏపీ ప్రజలు తనను పార్టీ పెట్టమని..తన పథకాలు అమలు చేయమని కోరుతున్నారని తెలిపారు. కెసీఆర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కూడా రకరకాల వ్యాఖ్యానాలు విన్పిస్తున్నాయి. పార్టీ సంగతి తర్వాత కానీ..విభజన ప్రకారం చట్టబద్ధంగా ఏపీకి ఇవ్వాల్సిన ఆస్తుల పంపకాలు ఇప్పటికైనా పూర్తి చేస్తే మంచిది అని వ్యాఖ్యానిస్తున్నారు. అవేమీ చేయకుండా ఇప్పుడు ఏపీ ప్రజలు రమ్మంటున్నారు..అంటే ఎవరూ నమ్మరని వ్యాఖ్యానిస్తున్నారు. ప్లీనరీలో వెలిసిన తెలుగుతల్లి వ్యవహారం కూడా ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు కెసీఆర్ ఇదే తెలుగుతల్లిని ఎవనికి తల్లీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.