Full Viewవైసీపీ అధినేత, సీఎం జగన్ కు ఇప్పుడు ఓ ఛాన్స్ వచ్చింది. రాష్ట్రపతి ఎన్నికల రూపంలో వస్తున్నఈ ఛాన్స్ ను జగన్ ను ఎలా ఉపయోగించుకోబోతున్నారు. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం చూస్తారా? లేక రాజకీయ ప్రయోజనాల కోణంలో ఆలోచిస్తారా అన్నది వేచిచూడాల్సిందే. జులైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి గెలవాలంటే వైసీపీ మద్దతు అత్యంత కీలకం. ఎందుకంటే ఆ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలతోపాటు 22 మంది లోక్ సభ సభ్యులు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ బలం మరింత పెరగనుంది. అటు ఎన్డీయే, ఇటు యూపీఏతో నేరుగా సంబంధం లేకుండా ఉన్న పార్టీలు వైసీపీ, టీఆర్ఎస్, బిజూ జనతాదళ్ పార్టీలు. ఈ పార్టీలు అవసరాన్ని బట్టి స్పందిస్తూ పోతున్నాయి. గత రాష్ట్రపతి ఎన్నికల సమయంలో వైసీపీతోపాటు టీఆర్ఎస్ కూడా బిజెపి సారధ్యంలోని ఎన్డీయే ప్రతిపాదించిన అభ్యర్ధికే మద్దతు ఇచ్చింది. అయితే ఈ సారి టీఆర్ఎస్ బిజెపి ప్రతిపాదించే అభ్యర్ధికి మద్దతు ఇచ్చే అవకాశాలు లేవనే చెప్పొచ్చు. ఇక మిగిలింది వైసీపీ, బిజూజనతాదళ్ , ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో సమావేశం అయిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలోనే రాష్ట్రపతి ఎన్నికల అంశంపై కూడా చర్చించినట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అటు బిజెపి, ఇటు వైసీపీ అధికారికంగా దీనిపై స్పందించలేదు. అయితే బిజెపి ఎప్పటి నుంచో దీనికి సంబంధించి తన వంతుగా తెరవెనక ప్రయత్నాలు చేస్తూ పోతుంది.
ఎలా చూసుకున్నా బిజెపికి ఇప్పుడు వైసీపీ మద్దతు అత్యంత కీలకం. మరి ఈ పరిస్థితిని ఉపయోగించుకుని సీఎం జగన్ ప్రధాని మోడీ ముందు ప్రత్యేక హోదాతో పాటు ఇతర విభజన హామీలను పెడతారా లేదా అన్నది వేచిచూడాల్సిందే. కేంద్రంలో బిజెపికి పూర్తి మెజారిటీ వచ్చినందున ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రాన్ని అడుగుతూ ఉండటం తప్ప ఏమీ చేయలేమని జగన్ ఇప్పటికే చేతులెత్తేశారు. మరి ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల రూపంలో జగన్ కు ఓ ఛాన్స్ వచ్చింది. బిజెపి అభ్యర్ధి గెలవాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి. ఈ కీలక సమయంలో ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల డిమాండ్లు పెట్టి సాధించుకుంటే రాజకీయంగా అది జగన్ కు, వైసీపీ కి కూడా అత్యంత కీలకంగా మారుతుందనటంలో సందేహం లేదు. మరి కీలక ఛాన్స్ ను ఉపయోగించుకోకుండా జగన్ బిజెపి అభ్యర్ధికి భేషరతుగా మద్దతు ఇస్తే మాత్రం రాజకీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడున్నాయి. ఎన్నికలకు ముందు జగన్ తమకు మెజారిటీ ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రకటించారు. ఆయన అప్పట్లో కేంద్రంలో ఎవరికీ మెజారిటీ రాకపోతేనే ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పలేదు. గెలిచిన తర్వాత కొత్త కొత్త కండిషన్లను తెరపైకి తెచ్చారు.