నిన్న మొన్నటి వరకూ ఢిల్లీ వాళ్లెందుకు ఇక్కడకు వస్తున్నారు. గుజరాత్ వాళ్లు ఎందుకు వస్తున్నారు అంటూ ప్రశ్నించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. అసలు టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ప్రాంతీయవాదంతో. మా రాష్ట్రాన్ని మేమే పాలించుకుంటాం...మా పాలన మేమే చేసుకుంటాం అన్నారు. ప్రజల సెంటిమెంట్ ను కెసీఆర్ రాజకీయ కోణంలో వాడుకుని విజయవంతం అయ్యారు. అదే సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏ మేరకు నిజం అయ్యాన్నది వేరే అంశం. విభజనవాదంతో మా పాలన మేమే చేసుకుంటాం అన్న సీఎం కెసీఆర్..దేశంలో ఎవరికీ సరిగ్గా పాలించటం చేతకావటంలేదు...తానొచ్చి పాలిస్తా.. అందరికీ మార్గదర్శనం చేస్తానంటే నేతలు అంతా ఎదురొచ్చి స్వాగతిస్తారా?. నిన్న మొన్నటి వరకూ సీఎం కెసీఆర్, కెటీఆర్ అన్న మాటలే వాళ్లు అనరా?. కెసీఆర్ జాతీయ పార్టీ అన్నది అసలు అది జరిగే పనేనా?. ఎక్కడివరకో ఎందుకు. నిన్న మొన్నటివరకూ కలసి ఉన్న ఏపీలో టీఆర్ఎస్ కు ఆమోదం లభిస్తుందా?. అంటే ఖచ్చితంగా సందేహమే అని చెప్పొచ్చు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఏ ఏజెండాతో ఆయన అడుగుపెడతారు.ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) క్రమక్రమంగా విస్తరిస్తుంది అంటే ఆ పార్టీ పుట్టిందే అవినీతికి వ్యతిరేకంగా..సుపరిపాలన అందిస్తామని.
అందుకే ఢిల్లీలో వరసగా విజయాలు సాధిస్తూ వస్తోంది. ఇప్పుడు పంజాబ్ ను కూడా కైవసం చేసుకుంది. నిజంగా ఆప్ విస్తరణకు టీఆర్ఎస్ కు ఉన్నటువంటి సాంకేతిక సమస్యలు ఏమీ లేవు. కానీ టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారాలంటే చాలా సమస్యలే వస్తాయి. మరి నిజంగా కెసీఆర్ చెబుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ పెడితే టీఆర్ఎస్ ను ఏమి చేస్తారు? ఒక్కరి సారధ్యంలో రెండు పార్టీలు ఉండవు కదా?. దేశంలో రాజకీయాలు ఇప్పుడు ఏజెండాల కంటే భావోద్వేగాల మీదే ఎక్కువ సాగుతున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అన్నీ ఆయా రాష్ట్రాల్లోని అంశాలపైనే ఫోకస్ పెడుతూ జాతీయ పార్టీల ప్రాబల్యం తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్రాల్లోనూ అసెంబ్లీలకు ఒక రకంగా..పార్లమెంట్ ఎన్నికలకు ఒక రకంగా తీర్పిస్తూ చాలా చోట్ల ఓటర్లు పరిణతి చూపిస్తున్నారు కూడా. తెలంగాణలోని కీలక సమస్యలను పక్కదారి పట్టించటమే లక్ష్యంగా కెసీఆర్ ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తున్నారనే వారూ లేకపోలేదు. నిజంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు అంత శక్తి ఉంటే బీహార్ లో ఆయనే పార్టీ పెట్టేవాడు కదా అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఈ నెల19న కెసీఆర్ జాతీయ పార్టీపై తుది నిర్ణయం ప్రకటిస్తారని ప్రముఖంగా వార్తలు వచ్చాయి.