తెలంగాణ రాజకీయాలకు జగన్ దూరం అందుకేనా?!

Update: 2022-12-24 06:36 GMT

Full Viewఅమరావతి విషయంలోనూ జగన్ అలాగే చెప్పారుగా!

వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. అదేంటి అంటే ఆంధ్ర ప్రదేశే నా రాష్ట్రము. ఇక్కడే ఇల్లు కట్టుకున్నా. ఇక్కడే ఉంటా. ఇదే నా రాజకీయ విధానం అంటూ ప్రకటించారు. ఒకప్పుడు మాట తప్పను మడమ తిప్పను అనే దానికి బ్రాండ్ అంబాసడర్ గా ప్రకటించుకున్న జగన్ ఎన్ని విషయాల్లో ఎన్నిసార్లు మాటలు మార్చారో లెక్కే లేదు. అందులో అత్యంత కీలకం అయింది ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి. జగన్ స్వయంగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక అమరావతికి ఒప్పుకుంటున్నట్లు అసెంబ్లీ వేదికగా చెప్పారు. అదే సమయంలో రాజధాని వేల ఎకరాలు ఉన్న ప్రాంతంలో పెట్టాలని కూడా కోరారు. ఇక వైసీపీ నాయకులు, ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ తాడేపల్లి ఇంటి ప్రారంభోత్సవం సందర్భంగా చెప్పిన మాటలు...వీడియోలు అయితే లెక్కే లేవు. సీన్ కట్ చేస్తే అమరావతి పోయి మూడు రాజధానులను తెర మీదకు తెచ్చి మాట మార్చిన విషయం తెలిసిందే. మరొకటి మండలి రద్దు అంశం. ఉండాల్సిన మేధావులందరూ అసెంబ్లీలోనే ఉన్నారు..మండలి వల్ల ఏటా కోట్లాది రూపాయలు దండగ అంటూ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఎప్పుడైతే మండలి లో టీడీపీ బలం తగ్గి వైసీపీ బలం పెరిగిందో ఇక్కడ కూడా సీన్ రివర్స్ చేశారు. జగన్ ఎక్కడో బయట చెప్పిన మాటలు మార్చటం కాదు...అటు అమరావతి అంశంపై అయినా..ఇటు మండలి అంశం పై అయినా జగన్ మాట్లాడింది సాక్ష్యాత్తు శాసన సభలోనే.

                                         ఇదే జగన్ ప్రత్యేక హోదా అంశంపై ఒక సారి సభలో మాట్లాడుతూ చాలా గంబీరంగా పార్లమెంట్, అసెంబ్లీ వంటి వేదికల్లో ఒక సారి మాట ఇచ్చాక వాటిని అమలు చేయకపోతే వీటికి విలువ ఏమి ఉంటుంది అంటూ ప్రశ్నించారు. కానీ ఈ మాటలు అన్నాకే జగన్ అమరావతి విషయం తో పాటు...శాసన మండలి రద్దు విషయంలో ఆయనే సభలో ప్రకటించి రివర్స్ గేర్లు వేశారు. తెలంగాణ రాజకీయాల్లో జగన్ వేలు పెట్టక పోవటానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయని అధికార వర్గాలు చెపుతున్నాయి. అవి ఏంటి అంటే ఉమ్మడి రాష్ట్రంలో జగన్ పై నమోదు అయినా కేసు లు అన్ని ఇక్కడే అంటే...తెలంగాణ కోర్టుల్లోనే ఉన్నాయి. విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ కేసుల విషయంలో తన వాదన వినిపించాల్సి ఉంటుంది. జగన్ అందరిలాగా తెలంగాణాలో కూడా రాజకీయ కార్యకలాపాలు స్టార్ట్ చేస్తే సీఎం కెసిఆర్ ప్రభుత్వపరంగా ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందని...అందుకే జగన్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు అని ఒక ఐఏఎస్ అధికారి తేల్చారు. ఇవి అన్ని క్లోజ్ అయ్యాక అప్పడు వైసీపీ కూడా తెలంగాణ లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు అని..అప్పటివరకు కేసు ల కారణంగా ఇటు చూడక పోవచ్చు అన్నారు. వీటిని కూడా జగన్ తనకు అనుకూలం గా మార్చు కుంటూ చంద్రబాబు, పవన్ కల్యాణల పై విమర్శలకు వాడుకుంటున్నారని అయన అభిప్రాయపడ్డారు. జడ్చెర్ల ఫార్మా ఎస్ఈజెడ్ లో భూ కేటాయింపులతో పాటు ఇందూ టెక్ జోన్ వంటి పలు కేసు లు తెలంగాణ రాష్ట్రానికి సంబందించినవి ఉన్నాయి. వీటిలో తెలంగాణా ప్రభుత్వ వాదన జగన్ కేసుల్లో అత్యంత కీలకం కానుంది.

Tags:    

Similar News