Full Viewఏపీలోని అధికార వైసీపీలో ఇదే హాట్ టాపిక్. వైఎస్ భారతికి పార్టీలో ఎలాంటి హోదా లేదు..పార్టీ వ్యవహారాల్లో ఆమె ఎక్కడా జోక్యం చేసుకున్న దాఖలాలు కూడా లేవు. కానీ రెండవ సారి రాజ్యసభ రెన్యువల్ దక్కించుకున్న విజయసాయిరెడ్డి అకస్మాత్తుగా సీఎం జగన్ తోపాటు ఆయన భార్య వైఎస్ భారతికి కూడా బహిరంగంగా దన్యవాదాలు చెప్పటం వెనక కారణం ఏమిటి?. వైసీపీలో రాజ్యసభ సీట్లను ఖరారు చేసేది పార్టీ అధినేత, సీఎం జగన్ అన్న విషయం తెలిసిందే. మరోసారి రాజ్యసభకు అవకాశం ఇచ్చినందుకు విజయసాయిరెడ్డితోపాటు సభ్యత్వం పొందిన వారెవరైనా సీఎం జగన్ కు దన్యవాదాలు తెలుపుతారు. అందులో పెద్దగా విశేషమేమీలేదు. కానీ విజయసాయిరెడ్డి సీఎం జగన్ తో పాటు వైఎస్ భారతికి కూడా ధన్యవాదాలు అంటూ మీడియా ముఖంగా ప్రకటించటం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి విజయసాయిరెడ్డికి గత కొంత కాలం పార్టీలో ప్రాధాన్యత తగ్గుతూ వస్తోందనే ప్రచారం బలంగా సాగింది. అందులో భాగంగానే అత్యంత కీలకమైన ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి..తొలుత కేవలం పార్టీ కార్యాలయంలో అనుబంధ విభాగాల బాధ్యతను మాత్రమే అప్పగించారు.
తర్వాత మళ్ళీ ఆయనకు ప్రాంతీయ సమన్వయ కర్తలు, జిల్లా పార్టీ ప్రెసిడెంట్లతో సమన్వయ బాధ్యతలు అప్పగించారు. రాదనుకున్న రాజ్యసభ మళ్లీ వచ్చినందునే విజయసాయిరెడ్డి సీఎం జగన్ తోపాటు ఆయన భార్య భారతికి కూడా ధన్యవాదాలు తెలిపినట్లు ఉందని ఓ వైసీపీ నేత వ్యాఖ్యానించారు. వైఎస్ భారతి పేరును ప్రస్తావించటం ఖచ్చితంగా అనవసర వ్యాఖ్యలకు తావివ్వటమే అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యసభ అభ్యర్ధిత్వం ఖరారు అయిన తర్వాత విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..'రెండోసారి నాపై నమ్మకం ఉంచి, నాపై అచంచల విశ్వాసంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజ్యసభకు పంపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. జగన్‌కి, ఆయన కుటుంబ సభ్యులు భారతమ్మ కు నేను మసస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాపైన ఉంచిన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తాను. రాజ్యసభ అనేది రాష్ట్రాల సభ కాబట్టి రాష్ట్ర సమస్యలను పార్టీపరంగానూ, సీఎం మనసులోని ఆకాంక్షలకు అనుగుణంగానూ నడుచుకుంటూ, ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతానని తెలియజేస్తున్నాను.' అంటూ పేర్కొన్నారు.