ఢిల్లీ గజ గజ ఏమో కానీ..భయంతోనే ఎన్నికలు పెట్టిన టీఆర్ఎస్

Update: 2020-12-05 05:30 GMT

వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ జీహెచ్ఎంసీ పాలక మండలికి గడువు ఉన్నా తెలంగాణ సర్కరు ఇంత ఆగమేఘాల మీద ఎన్నికలు ఎందుకు పెట్టింది?. నిబంధనల ప్రకారమే అయినా..అది అతి తక్కువ సమయం ఇస్తూ ఎన్నికలను పూర్తి చేయటానికి ఎందుకు ఆరాటపడింది?. అంటే సింపుల్ రీజన్. భయం. భయం ఒక్కటే కారణం. ఆలశ్యం అయ్యేకొద్దీ ఫలితాలు మరింత తారుమారు అయితాయని అంచనా వేసింది. దుబ్బాకలో పడిన దెబ్బే దీనికి కారణం. కానీ ఆ భయం కూడా టీఆర్ఎస్ ను ఏమీ కాపాడలేకపోయింది. నిజంగా టీఆర్ఎస్ భయపడినట్లే జరిగింది. 99 సీట్ల నుంచి 55 సీట్లకు పరిమితం అయింది. అదే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదనే విషయం తాజా ఫలితాలు నిరూపించాయి.

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రి కెటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలోనే మీడియా ప్రతినిధులు 'మేయర్' ఎన్నిక గురించి ప్రశ్నించారు. మేయర్ ఎన్నికకు చాలా సమయం ఉంది అంటూ సమాధానం ఇచ్చారు. ఆయన చెప్పినట్లే మేయర్ ఎన్నికకు అంత సమయం ఉంటే ఇప్పుడే ఎందుకు ఎన్నికలు పెట్టినట్లు?. అంటే పైన చెప్పుకున్నట్లు సింపుల్ రీజన్ భయం. సహజంగా అయితే ఎన్నికలు జరిగాక పాత పాలక వర్గాన్ని రద్దు చేసి..కొత్త పాలక వర్గం బాధ్యతలు తీసుకుంటుంది. కానీ ఊహించని షాక్ తో టీఆర్ఎస్ ఇప్పుడు షెడ్యూల్ ప్రకారమే అంటే జనవరి లోనే మేయర్, డిప్యూటీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అంటే అప్పటివరకూ ఈ పాలకవర్గమే కొనసాగనుంది. ఈ లోపు టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య చర్చలు జరుగుతాయని చెబుతున్నారు. ఈ లెక్కన ఇంత ఎర్లీగా ఎన్నికలు పెట్టబట్టే కనీసం టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అయినా నిలవగలిగింది అని చెప్పుకోవాలి.

Tags:    

Similar News