వాస్తవం చెప్పుకోవాలంటే దేశమంతటా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. నాయకత్వ సమస్యలతో కొట్టుమిట్లాడుతోంది. తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉన్నా నేతల మధ్య అనైక్యతే పెద్ద సమస్యగా ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణలో నేడు, రేపు పర్యటించనున్నారు. సహజంగా రాష్ట్రంలో జాతీయ స్థాయి పార్టీలు ఏవైనా సమావేశాలు పెట్టుకుంటే..ఆ సమావేశాల్లో ఆ నేతలు చేసిన విమర్శలు..వ్యాఖ్యలపై ప్రత్యర్ధి పార్టీలు..అధికార పార్టీలు కౌంటర్లు ఇస్తాయి. కానీ ఈ సారి మాత్రం విచిత్రంగా ఉన్నాయి పరిణామాలు. రాహుల్ పర్యటన ఖరారైన తర్వాత వారం రోజుల ముందు నుంచే అధికార టీఆర్ఎస్ నేతలు ఆగమాగం అవుతున్నారు. అసలు రాహుల్ తెలంగాణకు ఎలా వస్తాడు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏమి చేస్తున్నారు అంటూ ఒకటే విమర్శలు గుప్పిస్తున్నారు. టీఆర్ఎస్ అధికార పత్రికలో అయితే రాహుల్ టూర్ ను టార్గెట్ చేస్తూ..కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్న అంశాలపై ప్రత్యేక కథనాలు వండివార్చుతున్నారు. ఉస్మానియా యూనివర్శిటీ రాహుల్ ఎలా వెళతారు...ఎందుకెళతారు వంటి మాటలు అటు అధికార టీఆర్ఎస్ తోపాటు..ఇటు బిజెపి నేతలు కూడా చేస్తున్నారు.
మాట్లాడితే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ తమ వల్లే తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బిజెపి నేతలకు పదవులు వచ్చాయని పదే పదే చెబుతున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఉండకపోతే రెండు సార్లు కెసీఆర్ సీఎం, కెటీఆర్ మంత్రులు అయ్యేవారా అంటూ కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ వరంగల్ సభ పర్యటన ఖరారు అయినప్పటి నుంచి మంత్రులు కెటీఆర్, హరీష్ రావుతోపాటు ఎమ్మెల్సీ కవిత, కెసీఆర్ కేబినెట్ లోని వారంతా రాహుల్ పై విమర్శలు చేసేందుకు పోటీలు పడుతున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ ఎనిమిదేళ్ళలో సీఎం కెసీఆర్ రైతాంగానికి ఎంతో చేశామని..దేశానికి ఆదర్శం అని చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే ఆ ఫలితాలు అనుభవించిన రైతులకు ఆ విషయం తెలియదా?. రాహుల్ గాంధీ వరంగల్ వచ్చి ఒక్క సమావేశం పెట్టగానే రైతులంతా కాంగ్రెస్ వైపు మళ్లిపోతారా?. రైతులకు అంత చేసినట్లు ధీమా ఉన్న టీఆర్ఎస్ ఎందుకింత ఆగమాగం అవుతుంది.
ప్రత్యర్ధి పార్టీ నేతలపై విమర్శలు చేయటం తప్పేమీ కాదు. అది ఆయా పార్టీల అవసరం కూడా. కానీ అధికార టీఆర్ఎస్ కు చెందిన మంత్రులు..నేతలు రాహుల్ పర్యటన విషయంలో స్పందిస్తున్న తీరు చూసి మాత్రం ఎక్కడో ఏదో తేడా కొడుతుంది..అందుకే వీళ్లు ఇంతలా స్పందిస్తున్నారు అనే అనుమానాలు కలిగించేలా వ్యవహరిస్తున్నారు. సహజంగా అయితే రాహుల్ వరంగల్ సభలో వచ్చి ఏదో మాట్లాడి కాంగ్రెస్ గెలిస్తే ఏమి చేస్తామో చెప్పి వెళ్లేవారు. టీఆర్ఎస్ నేతల హంగామా చూసిన తర్వాత మాత్రం ఏదో జరగబోతుందనే అనేలా ఫీల్ క్రియేట్ చేస్తున్నారు. రాహుల్ సభ కు కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ మంత్రులు..నాయకులే ఎక్కువ ప్రచారం చేసినట్లు కన్పిస్తోందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాహుల్ గాంధీ సభపై భారీ ఆశలే పెట్టుకుంది. ఈ సభను విజయవంతం చేసుకోవటం ద్వారా తెలంగాణలో తాము అధికారంలోకి రాబోతున్నామనే సంకేతాలు ఇవ్వాలనే ప్రయత్నాల్లో ఉంది. అది మేరకు విజయవంతం అవుతుందో వేచిచూడాల్సిందే.