ఈ కామెడీ రాజకీయంగా పూర్తిగా జనసేనదేనా?
పవన్ ది ఓ మాట...నాదెండ్ల మనోహర్ ది ఓ మాట.
బద్వేల్ ఉప ఎన్నికపై విచిత్ర ప్రకటనలు
జనసేన రాజకీయం అంతా కామెడీగా ఉంటుంది. ఆ పార్టీ ప్రెసిడెంట్ ఒక ప్రకటన చేస్తారు. అదే పార్టీకి చెందిన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరో ప్రకటన చేస్తారు. అది పార్టీ ప్రెసిడెంట్ కు ఖండనలాంటిది. ఇది చూసిన రాజకీయ పార్టీలే కాదు..జనసేన కార్యకర్తలూ అవాక్కు అవుతున్నారు. జనసేన ముందు ఒక నిర్ణయం తీసుకుంది. అదికార వైసీపీ బద్వేలులో చనిపోయిన కుటుంబ సభ్యులకే సీటు ఇస్తున్నందున గతంలో ఉన్న సంప్రదాయాన్ని గౌరవించి తాము పోటీకి దూరంగా ఉంటామన్నారు. గెలుపు ఓటములతో సంబందం లేకుండా ఒక రాజకీయ పార్టీగా జనసేన ఈ నిర్ణయం తీసుకుంది. అంత వరకూ బాగానే ఉంది. జనసేన, బిజెపిలు ఏపీలో మిత్రపక్ష పార్టీలుగా ఉన్న విషయం తెలిసిందే. తమ మిత్రపక్ష బిజెపితో సంబంధం లేకుండా జనసేన ఈ ప్రకటన చేసింది. అయితే బిజెపితో వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకం అని తాము బరిలో ఉంటున్నామని అభ్యర్ధిని బరిలో నిలిపింది. అయితే ఇప్పుడు జనసేన రివర్స్ గేర్ వేసి..బద్వేలులో బిజెపి గెలుపుకు సహకరిస్తామని నాదెండ్ల మనోహర్ ప్రకటించటం విచిత్రంగా ఉంది. సంప్రదాయాన్ని గౌరవించి చనిపోయిన కుటుంబ సభ్యులకు చెందిన వ్యక్తిని నిలబెట్టినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.
మళ్ళీ ఇప్పుడు బద్వేల్ ఉపఎన్నికలో బీజేపీ గెలుపు కోసం సహకరిస్తామని ప్రకటించారు నాదెండ్ల మనోహర్. మరి అప్పుడు సంప్రదాయాన్ని గౌరవించినట్లు ఎక్కడ?. వారం రోజులు కాకుండా జనసేన రివర్స్ గేర్ ఎందుకు వేసింది. జనసేనను బిజెపి ఏమైనా బెదిరించిందా?. లేక జనసేన అధికారికంగా ప్రకటించి ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటుంది. బద్వేలులో గెలుపు ఎవరిదో అందరికి తెలిసిందే. గత ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లు చూసినా ఆ లెక్కలు వాస్తవం ఏంటో చెబుతాయి. మరి పక్కాగా ఓడిపోయే సీటులోనూ జనసేన ఇంత తింగరి రాజకీయం ఎందుకు చేస్తున్నట్లు. నాదెండ్ల మనోహర్ అలా ప్రకటన చేశారో లేదో..ఏపీ బిజెపి ప్రెసిడెంట్ సోము వీర్రాజు ఈ వార్తకు సంబంధించి టీవీల్లో వచ్చిన స్క్రీన్ షాట్లు తీసుకొచ్చి తన ఫేస్ బుక్ పేజీలో పెట్టుకున్నారు. ఏది ఏమైనా జనసేన మాత్రం ఎవరి అవసరం లేకుండా ఎప్పటికప్పుడు తన పరువు తానే తీసుకుంటుంది.అయితే ఒంటరిగా పోటీచేస్తే మరీ పరువుపోతుందని బిజెపి ఒత్తిడి తెచ్చి జనసేనతో ఈ ప్రకటన చేయించిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.