ఆంధ్రుల హక్కుపై 'నోరు నొక్కుకున్న' జగన్..చంద్రబాబు..పవన్

Update: 2021-02-05 04:29 GMT

వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపై నోరు తెరవని కీలక నేతలు

హక్కులు సాధించుకోలేరు..ఉన్నవి కాపాడుకోలేరు

విభజన చట్టం ప్రకారం కేంద్రంలోని మోడీ సర్కారు ఏపీలోని కడప జిల్లాకు 'ఉక్కు ఫ్యాక్టరీ' ఇవ్వాలి. హక్కుగా ఇవ్వాల్సిన ఈ ప్రాజెక్టును తెచ్చుకోవటంలో చంద్రబాబునాయుడుతోపాటు జగన్ కూడా విఫలమయ్యారు. ఏపీకి చట్టబద్ధంగా రావాల్సిన హక్కులను ఇద్దరూ ఇలా వదిలేసినవి ఎన్నో. కానీ ఏపీ ప్రయోజనాలను తాము తప్ప మరెవరూ కాపాడలేరనే తరహాలో మాటలు మాత్రం కోటలు దాటేలా చెబుతారు. అలాంటిది ఒకప్పుడు విశాఖ హక్కు...ఆంధ్రుల హక్కు అని నినదించి సాధించుకున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 'ప్రైవేట్ పరం' అవుతుంటే అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ..ఇటు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబునాయుడు కానీ నోరు తెరిచి ఇదెక్కడి అన్యాయం అని మాట్లాడని పరిస్థితి. విభజన చట్టం ప్రకారం రావాల్సిన హక్కులను సాధించుకోవటంలో విఫలం అవుతున్న ఇద్దరు నేతలు ఉన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు 'ప్రైవేట్ పరం' అవుతుంటే కూడా అడ్డుకోలేని...నోరుతెరిచి మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.

ఎన్నో వనరులు, వెసులుబాట్లు ఉన్న కేంద్రమే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్వహించలేకపోతే.. కేవలం లాభాలు..స్వప్రయోజనాలు తప్ప మరేమీ పట్టని సంస్థల చేతిలోకి వెళితే ..ఆ ఆస్తులు ఏమి అవుతాయో తెలిసిందే. మరో నేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు బిజెపితో దోస్తీలో ఉన్నారు కాబట్టి ఆయన నోరు తెరిచి ఏమీ మాట్లాడరు. వాస్తవానికి ఏపీలో సమస్యలపై స్పందించేందుకు ఆయనకే అవకాశాలు ఎక్కువ. కారణాలేంటో తెలియదు కానీ..ఆయన అవకాశాలను వదిలేసి బిజెపితో జతకట్టి ఉన్న ఓటు బ్యాంకును దూరం చేసుకుంటున్న పరిస్థితి. విభజన కారణంగా హైదరాబాద్ వంటి నగరాన్ని కోల్పోయిన ఏపీకి సంబంధించిన హక్కుల విషయంలో ఎవరి రాజకీయాలు వారు తప్ప ..రాష్ట్ర ప్రయోజనం అన్న అంశాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోరు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు వేటిలోనూ పార్టీలు అన్నీ ఒక్కటి అయి పోరాడిన చరిత్ర ఏపీ నేతలకు లేదు.

Tags:    

Similar News