అధినేత చెప్పాకే స్పందించారా?
లేకపోతే ఖండనకు ఇంత సమయం ఎందుకు?
24 గంటల తర్వాత తాపీగా ప్రకటనతో కొత్త చర్చ
ప్రాంతీయ పార్టీ ఏదైనా అంతా అధినేత ఇష్టమే. టీఆర్ఎస్ లో అయితే అది మరింత కాస్త ఎక్కువగా ఉంటుంది. మంత్రి హరీష్ రావు టీఆర్ఎస్ లో ఎన్నోసార్లు ఉక్కపోతలు ఎదుర్కొన్నారు. ఇది అందరూ చూసిందే. అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని తాజాగా పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కూడా ప్రస్తావించారు. తనలాగే హరీష్ రావు కు కూడా పార్టీలో ఎన్నో అనుమానాలు జరిగాయన్నారు. ఆయన ఈ మాటలు అన్నది శుక్రవారం ఉదయం పది గంటలకు నిర్వహించిన మీడియా సమావేశంలో. ఈటెల వ్యాఖ్యలు సహజంగానే మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. వాస్తవానికి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు స్వచ్చందంగా కౌంటర్ ఇవ్వాలనుకుంటే నిన్ననే ఇచ్చేవారు. లేదంటే ఉదయం పత్రికల్లో చూసిన తర్వాత అయినా స్పందించేవారు. ఈటెల రాజేందర్ వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నేతలు..మంత్రులు వరస పెట్టి మీడియా సమావేశాలు పెట్టి కౌంటర్లు ఇచ్చారు. రాజకీయ పార్టీగా ఇది అత్యంత సహజం. కానీ హరీష్ రావు చాలా ఆలశ్యంగా స్పందించారు. ఈటెల రాజేందర్ అంత సీరియస్ విమర్శలు చేసినా హరీష్ రావు మరుసటి రోజు సాయంత్రం వరకూ ఎందుకు మౌనంగా ఉండిపోయారు.
ఆ తర్వాత ఏమి జరిగి ఉంటుంది. అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే హరీష్ రావు రంగంలోకి దిగారా?. అందరు మాట్లాడింది ఒకటి..నీ తరపున కూడా ఖండన ఇవ్వాల్సిందే పైన నుంచి వచ్చిన సంకేతాల తర్వాతే హరీష్ రావు రంగంలోకి వచ్చారా?. అంటే ఔననే చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. వాస్తవానికి స్వచ్చంద స్పందన ఉండాలంటే..ముఖ్యమంత్రి, పార్టీ అదినేత కెసీఆర్ దగ్గర మార్కులు కొట్టాలయని అనుకునే వారు అదేమీ లేకుండానే అప్పటికప్పుడు రంగంలోకి దిగి ఖండఖండాలుగా ఖండించి వెళ్ళిపోయేవారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. అందుకే ఇది చర్చనీయాంశంగా మారింది. పార్టీలో హరీష్ రావు, ఈటెల రాజేందర్ అత్యంత సన్నిహితంగా ఉన్నవారే. కానీ మారిన పరిస్థితుల్లో ఈ లెక్కలు కూడా మారిపోయాయి. అదే తరుణంలో హరీష్ రావు ఇంత లేట్ గా స్పందించటం ఆసక్తికర పరిణామంగా మారింది.