వైసీపీ మంత్రుల ప్రచారానికి లేని 'కరోనా'..జగన్ సభకే ఎందుకు?

Update: 2021-04-11 07:24 GMT

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికను అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే పలువురు మంత్రులు ఐదు లక్షల మెజారిటీ అంటే..మరికొంత మంది మూడు లక్షల మెజారిటీ గురించి ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ గెలుపుపై ఎవరికీ పెద్దగా సందేహాలు లేకపోయినా మెజారిటీ ఎంత వస్తుందనేదే చర్చనీయాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీలో రాజకీయంగా స్తబ్దత నెలకొంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఇది మరింత పెరిగిందనే చెప్పొచ్చు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల కోసం మాత్రం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వైసీపీ తరపున పలువురు మంత్రులు రంగంలోకి దిగారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు..ఇతర నేతలు కూడా తిరుపతి నియోజకవర్గ పరిధిలో క్యాంప్ లు వేసి పార్టీ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఈ తరుణంలో అకస్మాత్తుగా సీఎం జగన్ కూడా ఎన్నికల ప్రచారానికి వస్తున్నట్లు ప్రకటించారు.

సభ ఏర్పాట్లను కూడా మంత్రి పెద్దిరెడ్డి వంటి నేతలు పరిశీలించారు. కానీ సడన్ గా కరోనా పేరు చెప్పి సీఎం జగన్ సభను రద్దు చేసుకున్నట్లు ప్రకటించి..ఓ లేఖ విడుదల చేశారు. పలు నియోజకవర్గాల్లో వైసీపీ మంత్రులు...భారీ జనసమీకరణతో ర్యాలీలు..సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరి వారెవరికీ లేని కరోనా కేసులు పెరుగుదల సమస్య ఒక్క సీఎం జగన్ సభకే వర్తిస్తుందా?.వైసీపీ అధినేత, సీఎం జగన్ నేరుగా బహిరంగ సభ ద్వారా ప్రజలను ఓట్లు అడిగితే ఆ ప్రభావం వేరుగా ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ తొలుత సీఎం సభ ఉందని ప్రకటించి కరోనా కారణంగా సభను వాయిదా వేసుకోవటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

జగన్ సభ నిర్వహించాలనుకుంటే పరిమిత సంఖ్యలోనే..అంటే ఎంత మంది అంటే అంత మందికి మాత్రమే అనుమతించి నేరుగా సీఎం జగన్ తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతోపాటు..విపక్షాల విమర్శలకు సమాధానం చెప్పే ఛాన్స్ దొరికేది. కానీ సీఎం జగన్ మాత్రం కరోనా పేరు చెప్పి సభను రద్దు చేసుకోవటం విపక్షాలకు విమర్శలకు ఛాన్స్ ఇచ్చినట్లు అయింది. వైసీపీకి గత ఎన్నికల్లో 22 మంది ఎంపీలను గెలిపించినా ఎంతో కీలకమైన ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి సీఎం జగన్ ఏమీ తీసుకురాలేకపోతున్నారనే అంశంపై ఫోకస్ పెట్టింది. నిజంగా సీఎం జగన్ సభ రద్దుకు కరోనానే కారణం అయితే కేసులు శరవేగంగా పెరుగుతున్నా ఏపీలో మాత్రం స్కూళ్ళు..థియేటర్లు అన్నీ మామూలుగానే నడుస్తున్నాయి. అటు వైసీపీ, టీడీపీ, బిజెపి సభలకు లేని కరోనా సమస్య ఒక్క జగన్ సభకు మాత్రమే రావటం విచిత్రంగా ఉంది.

Tags:    

Similar News