జీహెచ్ఎంసీలో బిజెపి..జనసేన పొత్తు ఎందుకు చెదిరింది!

Update: 2020-11-19 04:14 GMT

అత్యంత ప్రతిష్టాత్మకమైన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి-జనసేనల పొత్తు ఎందుకు విఫలమైంది?. సడన్ గా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పొత్తుల గురించి తమతో ఎవరూ మాట్లాడలేదని ఎందుకు ప్రకటించారు?. జీహెచ్ఎంసీ బరిలో దిగాలని ముందే నిర్ణయించుకున్న జనసేన గతంలోఎన్నడూలేని రీతిలో హైదరాబాద్ సమస్యలపై స్పందించటంతోపాటు..తెలంగాణ బిజెపికి అనుకూలంగా ప్రకటనలు చేయటం మొదలుపెట్టింది. దుబ్బాక ఎన్నికల సమయంలో బండి సంజయ్ అరెస్ట్ పై కూడా పవన్ కళ్యాణ్ ఆగమేఘాల మీద స్పందించారు. కాస్తో కూస్తో బేస్ ఉన్న ఏపీలోని అంశాలపైనే జనసేన స్పందన తాపీగా ఉంటుంది. అలాంటిది బండి సంజయ్ అరెస్ట్..రఘునందన్ రావు వ్యవహారంలో జనసేన గతానికి భిన్నంగా వ్యవహరించింది. ఒక జాతీయ పార్టీ..ప్రాంతీయ పార్టీ పొత్తు పెట్టుకుని ఒక రాష్ట్రంలో పొత్తు ఉంటుంది..మరో రాష్ట్రంలో పొత్తు ఉండదు అంటే రాజకీయంగా చాలా ఇబ్బందికర పరిస్థితి. వాస్తవానికి బిజెపితో పొత్తు కోసం పవన్ కళ్యాణ్ వెంపర్లాడుతున్నట్లు ఉంది కానీ బిజెపి పెద్దగా ఈ అంశాన్ని పట్టించుకుంటున్నట్లు లేదు. అందుకే అమరావతి విషయంతో పాటు పలు విషయాల్లో బిజెపి తాను అనుకున్నట్లే ముందుకు సాగుతుంది.

అయితే బిజెపి వివరణలు కూడా పవన్ కళ్యాణే ఇస్తుండటంతో చూసే వారు కూడా ఆశ్చర్యపోతున్నారు.. అయితే ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన తమకు 40 సీట్లు కావాలని కోరటంతో ఈ వ్యవహారానికి బ్రేకులు పడ్డాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా అన్ని సీట్లు జనసేనకు ఇవ్వటానికి బండి సంజయ్ సిద్ధపడలేదని చెబుతున్నారు. అదే సమయంలో జనసేన కూడా తాము జీహెచ్ఎంసీ బరిలో నిలబడతామని ప్రకటించింది. ఓ వైపు బిజెపి కాంగ్రెస్ నుంచి వచ్చేవారిని చేర్చుకుని సీట్లు ఇవ్వటానికి రెడీ అవుతుంది కానీ..పొత్తు ఉన్న జనసేనకు మాత్రం కోరినన్ని సీట్లు ఇవ్వటానికి నో చెబుతోంది. అయితే జనసేన తరపు నుంచి ఈ పొత్తు వ్యవహారంపై ఎలాంటి స్పందన లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే జనసేనను బిజెపి ఇంత లైట్ గా తీసుకుంటే మరి ఇక అది ఏపీ అయినా..తెలంగాణ అయినా అసెంబ్లీ, పార్లమెంట్ విషయాల్లో ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సిందే.

Tags:    

Similar News