బిజెపి ఏపీకి మరో మూడేళ్ళు రాజధాని వద్దంటుందా?

Update: 2020-12-15 12:42 GMT

ఏపీ రాజధాని అంశంపై బిజెపి ఆటలు

2024 వరకూ జగన్ ఏమీ చేయకుండా ఉంటారా?

సోము వీర్రాజు వ్యాఖ్యల కలకలం

'నిన్నటి వరకూ అమరావతి రైతులకు న్యాయం చేసే వరకూ పోరాడతాం. చివరి రైతు వరకూ న్యాయం చేయటమే మా లక్ష్యం. రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదే. కేంద్రానికి దీంతో సంబంధం లేదు. ఎవరైనా అందుకు భిన్నంగా చెప్పినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.' ఇవీ బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుచేసిన వ్యాఖ్యలు. కానీ రెండు రోజుల నుంచి సోము వీర్రాజు మాటల్లో తేడా స్పష్టంగా కన్పిస్తోంది. అమరావతే రాజధాని. ఇదే మా విధానం అంటూ కుండబద్దలు కొడుతున్నారు. రైతులకు న్యాయం అనే అంశాన్ని పక్కన పెట్టి అసలు కీలక అంశం రాజధానిపైనే స్పష్టంగా ప్రకటన చేస్తున్నారు. అంతే కాదు 2024లో బిజెపిని గెలిపిస్తే ఐదు వేల కోట్ల రూపాయలతో అమరావతిలో అద్భుతమైన భవనాలు కడతాం. మరో రెండు వేల కోట్ల రూపాయల రైతులకు సుందరమైన ప్లాట్లు ఇస్తాం అని ప్రకటించారు. అంటే 2024లో బిజెపిని గెలిపించే వరకూ ఏపీ సీఎం జగన్ తాను తలపెట్టిన మూడు రాజధానుల విషయంలో ముందుకెళ్ళరా?. వెళ్ళలేరా?. అంటే బిజెపికి అధికారం వచ్చే వరకూ ఏపీలో రాజధాని ముందుకెళ్ళకూడదని సోము వీర్రాజు కోరుకుంటున్నారా?.

రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో శాశ్వత రాజధాని నిర్మాణం సాగలేదు. జగన్ సీఎం అయి రెండేళ్ళు కావస్తోంది. ఆయన తలపెట్టిన మూడు రాజధానులు కూడా అడుగు ముందుకు పడటం లేదు. సోము వీర్రాజు చెబుతున్న మాటల ప్రకారం అమరావతిలో రాజధాని రావాలి అంటే రాష్ట్ర ప్రజలు శాశ్వత రాజధాని భవనాలు లేకుండా అలా అనిశ్చితితో వేచిచూడాల్సిందే అన్న మాట. అతి కొద్ది సమయంలోనే సోము వీర్రాజు అమరావతి విషయంలో యూటర్న్ తీసుకోవటం ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీని వెనక ఉన్న కారణాలు ఏమిటి అన్న అంశంపై చర్చ మొదలైంది.

బిజెపి, టీడీపీ కలసి ఉన్న సమయంలో ఓ సారి అప్పటి సీఎం చంద్రబాబు స్వయంగా ప్రధాని మోడీ తనను ఇస్తాంబుల్ వెళ్ళి చూడమని చెప్పారంటూ ప్రకటించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే మోడీ చెప్పింది ఒక పేరు అయితే చంద్రబాబు ఆ సమయంలో పలు దేశాల పేర్లు చెప్పారు..పలు దేశాలు తిరిగారు. స్వయంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సర్కారు రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం లేదని చెబుతుంటే...ఇప్పుడు సోము వీర్రాజు మాత్రం అమరావతే మా రాజధాని మా పార్టీ ఆఫీసు కూడా ఇక్కడే కట్టుకుంటాం అని ప్రకటించటం వల్ల సీఎం జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా?. మార్చుకునేలా బిజెపి ఒప్పించగలుగుతుందా?. అది జరిగే పనేనా?. ఈ అంశాలు అన్నీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Tags:    

Similar News