హరీష్ చెప్పిందే జరిగింది!

Update: 2021-11-02 10:33 GMT

నిజం. తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావే చెప్పిందే జరిగింది. అక్టోబర్ 30న పోలింగ్ హుజూరాబాద్ లో పోలింగ్ ముగిసిన వెంటనే హరీష్ రావు ఓ ప్రకటన విడుదల చేశారు. అదేంటి అంటే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటర్లు చైతన్యాన్ని చాటారు. ఎంత చైతన్యం లేకపోతే అధికార పార్టీ విసిరిన వలలను దాటి హుజూరాబాద్ లో రాజ‌కీయంగా ఏ మాత్రం ఉనికి లేని బిజెపి తరపున బరిలో నిలిచిన ఈటెల రాజేందర్ ను అక్కడి ఓటర్లు గెలిపిస్తారు. నిన్న మొన్నటి దాకా ఈటెల రాజేందర్ ప్రభుత్వంలో మంత్రిగా , టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న విషయాన్ని మర్చిపోయి మరీ హరీష్ రావు హుజూరాబాద్ లో ఈటెల ఏమీ అభివృద్ధి చేయలేదని..డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా కట్టించలేకపోయారని విమర్శించారు. మంత్రిగా ఉండి ఈటెల రాజేందర్ అభివృద్ధి చేయలేకపోయారంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం కిందకే వస్తుంది కానీ..ఈటెల రాజేందర్ వ్యక్తిగత వైఫల్యం కిందకు వస్తుందా?. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లు అభివృద్ధి పనులు చేసేందుకు ఏమైనా ప్రత్యేక స్వేచ్చ ఉందా?. ఉంటే గింటే అది కేవలం కొంత మందికి మాత్రమే అన్న విషయం బహిరంగ రహస్యమే అన్న సంగతి తెలిసిందే.

అది కూడా సీఎం కెసీఆర్, మంత్రులు కెటీఆర్, హరీష్ రావులకు మాత్రమే. అంతే కాదు..ఈటెల రాజేందర్ పై వ్యతిరేకత పెంచేందుకు హరీష్ రావు ఉపయోగించని అస్త్రాలు లేవు. టీఆర్ఎస్ పార్టీ రైతులను కారు ఎక్కి వెళ్లి వ్యవసాయం చేసేలా చేస్తుంటే..బిజెపి మాత్రం రైతులపై కారు పోనిచ్చి వాళ్ళను చంపేస్తోందని అంటూ ఉత్తరప్రదేశ్ ఘటను చూపిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాసయాదవ్ అయినా..హరీష్ రావు తానే అభ్యర్ధి అన్నంతగా ప్రచారం నిర్వహించారు అయినా సరే ఫలితం లేకుండా పోయింది. అంతే కాదు..ఈటెల రాజేందర్ కు టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ అధినేత కెసీఆర్ ఎంతో చేశారంటూ హరీష్ రావు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. 2001 నుంచి ఇక్కడి ప్రజలు కెసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ వస్తున్నారనటం ద్వారా ఆ బలం కెసీఆర్ ది తప్ప..ఈటెల రాజేందర్ కాదని చెప్పే ప్రయత్నం చేశారు.. కానీ ఈటెల రాజేందర్ ఈ ఉప ఎన్నికలో విజయాన్ని అందుకునే దిశ‌లో సాగుతూ పెద్ద సంచ‌ల‌నం న‌మోదు చేయ‌బోతున్నారు. ద‌ళిత‌బంధు మొద‌లుకుని హుజూరాబాద్ పై టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌త్యేక ప్రేమ చూపించినా అవేమీ ప‌ట్టించుకోకుండా ఈటెల రాజేంద‌ర్ ను విజ‌యం దిశ‌గా న‌డిపించారంటే హుజూరాబాద్ ఓట‌ర్ల చైత‌న్యాన్ని ఏ మాత్రం విస్మ‌రించ‌లేమ‌ని నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. 

Tags:    

Similar News