ధర్నా చౌక్ వద్దని..నేరుగా ధర్నాల్లోకి..ఎంత మార్పు!

Update: 2020-12-06 12:17 GMT

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనటానికి ఇదే నిదర్శనం. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తొలి టర్మ్ లో సీఎం కెసీఆర్ అసలు హైదరాబాద్ లో ధర్నా చౌక్ అక్కర్లేదని తేల్చేశారు. అదేమిటంటే ప్రజలకు ఇబ్బంది అవుతుందనే కొత్త వాదన తెరపైకి తెచ్చారు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఇదే టీఆర్ఎస్ ప్రజలు ఇబ్బంది పడేలా ఎన్నో ఉద్యమాలు చేసింది. అది ప్రజల ఆకాంక్ష. తప్పులేదు. ఏ ఉద్యమాలు చేసి అయితే అధికారంలోకి వచ్చారో అదే నేతలు అసలు ధర్నాలు చేయటానికే వీల్లేదన్నారు. కావాలంటే ఎక్కడో ఊరుబయట చేసుకోండి అంటూ హుకుంలు జారీ చేశారు. చివరికి హైకోర్టు జోక్యం చేసుకుని కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేకుండా చేయటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదంటూ పేర్కొంది. ధర్నా చౌక్ పై ఎంత రగడ జరిగిందో అందరికీ గుర్తుంది. ఒక్క ధర్నా చౌక్ ఒక్కటే కాదు. అసలు ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ అయితే అంతా ఓ కోటలాగా ఇనుప కంచెలతో అటువైపు ఎవరూ పోకుండా చేశారు. అసలు తెలంగాణకు గుండెకాయ లాంటి నగరంలో ఎలాంటి నిరసనలు ఉండకూడదనే తరహాలో వ్యవహరించిన ప్రభుత్వమే ఇప్పుడు నేరుగా ధర్నాల్లోకి దిగటానికి రెడీ అవుతోంది. ఇది ప్రభుత్వపరంగా కాకపోయినా టీఆర్ఎస్ పేరుతో అయినా నేరుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నాల్లో పాల్గొనాలని మంత్రి కెటీఆర్ స్వయంగా మీడియా వేదికగా పిలుపునిచ్చారు.

ఒకప్పుడు ధర్నా చౌక్ వద్దన్న వాళ్లే ఇప్పుడు కారణం ఏదైనా నేరుగా ధర్నాలకు దిగటం అనేది కాలమహిమే అని చెప్పకతప్పదు. అది కూడా జాతీయ రహదారుల మీద. మరి ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగదా?. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో 'ప్రకటన'లతో బండి నడిచే కాలం చెల్లిపోయిందని గుర్తించినట్లు ఉన్నారు. అందుకే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నారు. రైతుల సమస్యల తరపున నిలబడటం సమర్దనీయమే అయినా...కేంద్రం మందబలంతో రాజ్యసభలో బిల్లులను ఆమోదింపచేసుకుందని కెటీఆర్ వ్యాఖ్యనించారు. తెలంగాణలో ప్రతిపక్షం ఏమి మాట్లాడినా..దేనిపై అభ్యంతరం వ్యక్తం చేసినా ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు. తప్పు అయితే జనం తర్వాత చెబుతారు..మీ మాటలు మేం వినం అన్న తరహాలో అసెంబ్లీ సాక్షిగా టీఆర్ఎస్ అగ్రనేతలు కెసీఆర్, కెటీఆర్ లు ప్రకటించారు. కానీ ఇదే నేతలు ఇప్పుడు బిజెపి మంద బలంతో బిల్లులు ఆమోదింపచేసుకుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో అక్కడ బిజెపి, ఇక్కడ టీఆర్ఎస్ పెద్ద మినహాయింపు ఏమీ కాదు.

Tags:    

Similar News