వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా పార్టీ తరపున గట్టిగా మాట్లాడిన వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళలో రోజా, అంబటి రాంబాబులు ముందు వరసలో ఉంటారు. వైసీపీ అధికారంలోకి వస్తే వీరిద్దరికి మంత్రి పదవి గ్యారంటీ అని అందరూ భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా సీఎం జగన్ వీరికి తొలి దశలో ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముహుర్తం దగ్గర పడుతున్న వేళ మళ్ళీ ఈ చర్చ ప్రారంభం అయింది. ప్రతిపక్షంలో పార్టీ కోసం గట్టిగా నిలబడిన అంబటి రాంబాబు, రోజాలకు మంత్రి పదవులు వస్తాయా? రావా అన్నదే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు మొదలుకుని నేతలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం. వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా అంబటి రాంబాబు నిన్నమొన్నటివరకూ పార్టీ తరపున గట్టిగా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఆడియో ఒకటి ఆయన్ను ఒకింత ఇబ్బందుల్లోకి నెట్టిందనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో పార్టీకి చెందిన నేతలే కుట్ర పూరితంగా అంబటి రాంబాబును బుక్ చేశారనే వాదనలు ఉన్నాయి. మరి ఇవన్నీ పక్కన పెట్టి ప్రతిపక్షంలో పార్టీ కోసం కష్టపడిన అంబటి రాంబాబుకు ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది వేచిచూడాల్సిందే. ఇక రోజా విషయానికి వస్తే ఆమె తొలి దఫా ఛాన్స్ రాకపోవటంతో ఒకింత నిరాశకు గురయ్యారు. ఇది గుర్తించే ఆమెకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఇప్పుడు ఆ పదవి కాలం కూడా ముగిసిపోయింది.
మరి మంత్రివర్గంలో రోజాకు ఛాన్స్ ఉంటుందా?. ఓ వైపు నగరి నియోజకవర్గంలో రోజాకు సొంత పార్టీ నేతలే ఇబ్బంది పెడుతుంటే పార్టీ తరపున గట్టిగా వారించిన సందర్భాలు లేవని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తరుణంలో రోజాకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందా?. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులతో గుర్తింపు ఉంటుందని జగన్ వీరికి పదవులు ఇవ్వటం ద్వారా సంకేతం ఇస్తారా? లేక సీనియర్లు అయినా..జూనియర్లు తనకు నచ్చితేనే అన్న వైఖరి తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ దఫా విస్తరణలో మాత్రం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డికి మాత్రం ఛాన్స్ ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఎన్నికల ప్రచారంలోనే ఆళ్ల గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని జగన్ బహిరంగంగా ప్రకటించారు. కానీ తొలి దశలో ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం ఆయనకు ఛాన్స్ పక్కా అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి అంబటి రాంబాబు, రోజాల పరిస్థితి ఏంటో వేచిచూడాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నేతలు అయిన ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి లాంటి వారు ఎమ్మెల్యేలుగా గెలిచినా అసలు వారు వైసీపీలో ఉన్నారా? లేరా అన్న పరిస్థితి ఉందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.