చరిత్రలో తొలిసారి! .. ఏపీ సీఎం జగన్ కు క్షత్రియ సమాజం విన్నపం
ఏపీలో రాజకీయ విమర్శల భాష హద్దులు దాటుతోంది. ఒకరిపై ఒకరు గతంలో ఎన్నడూలేని రీతిలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే ఏకంగా మీ మంత్రి, ఎంపీ వాడే భాష బాగాలేదని అంటూ రెండు తెలుగు రాష్ట్రాల క్షత్రియ సమాజం తరపున ఓ పత్రికా ప్రకటన వెలువడటం పద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రె్డ్డికి విన్నపం అంటూ రెండు తెలుగు రాష్ట్రాల క్షత్రియుల తరపున ఈ ప్రకటన వెలువడింది. తెలుగు రాష్ట్రాల్లో తాము ఎంతో గౌరవ మర్యాదలతో జీవనం సాగిస్తున్న సామాజికవర్గం తమది అని పేర్కొన్నారు. తమ క్షత్రియ సమాజం ఎన్నో వందల సంవత్సరాల నుంచి ధార్మిక సంస్థలను స్థాపించి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించిన సామాజికవర్గం అని పేర్కొన్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుపై రాజ్యసభ సభ్యులు అసభ్య భాష వాడిన సంఘటనతో తమ క్షత్రియ సమాజంలో కొంత ఆవేదన నెలకొని ఉందన్నారు.
క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వారు వైసీపీతో పాటు ఇతర పార్టీల్లోనూ ఉన్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా తాము ఈ వినతిని చేస్తున్నామని..రాజవంశానికి చెందిన అశోక్ గజతిరాజును ఎంపీ సంభోదించిన విధానం చాలా అమర్యాదకరంగా ఉన్నది. విజయనగరం రాజవంశానికి చెందిన పూసపాటి అశో క్ గజతిరాజుపై మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలపై మీ మంత్రివర్గ సభ్యులు చేసిన విమర్శలు, ఆయన వాడిన అసభ్యకర పదజాలం ఆ మంత్రి స్థాయిని..మీ ప్రభుత్వ స్థాయిని దిగజార్చేలా ఉన్నాయి. ఈ సంఘటన క్షత్రియ సమాజాన్ని గాయపరిచింది అనటంలో సందేహం లేదు.
ఈ విషయంలో తాము మీడియా ద్వారా కూడా స్పందించామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా చట్టానికి..న్యాయానికి లోబడే ఉండాలని..తాను అలా ఉంటానని అశోక్ గజపతిరాజు మీడియా సమావేశంలోనే చెప్పారన్నారు. ఈ అంశాలు అన్నీ పరిశీలించి ఆంధ్ర రాష్ట్ర ప్రజాప్రతినిధుల్లోని కొందరి శృతి మించిన భాషను సరిచేసి తమ క్షత్రియ సమాజ మనోభావాలను కాపాడాలన్నారు. మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై హైకోర్టు వచ్చిన తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లు మాజీ ఎంపీ, ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజుపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వీటిపైనే క్షత్రియ సమాజం తరపున పత్రికా ప్రకటన రూపంలో వీరు తమ నిరసన తెలిపారు.మంత్రి, ఎంపీ వాడిన భాష అభ్యంతకరం అంటూ ఇలా ఓ యాడ్ ద్వారా ముఖ్యమంత్రికి అభ్యంతరం వ్యక్తం చేయటం చరిత్రలో ఇదే మొదటిసారి అని అభిప్రాయపడుతున్నారు.