ఆలోచనలు ఉండాలే కానీ..అవకాశాలు అనంతం. ముంబయ్ కు చెందిన ఓ ట్రావెల్ కంపెనీ ఈ సంక్షోభ సమయాన్ని కూడా ఓ అవకాశంగా మలచుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అందరూ వ్యాక్సిన్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్ రావాలే కానీ..ఎంత ధర అయినా చెల్లించి వేయించుకోవటానికి సిద్ధంగా ఉన్న వారు ఎంత మందో. అయితే అందరి కంటే ముందు అమెరికాలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ ట్రావెల్ కంపెనీ 'వ్యాక్సిన్ టూరిజం' కాన్సెప్ట్ ను తెరపైకి తెచ్చింది. కాకపోతే ఇది సంపన్నులకు తప్ప...సామాన్యులకు అందుబాటులో ఉండటం కష్టమే. అసలు ఈ టూరిజం కాన్సెప్ట్ ఏమిటంటే అమెరికాలో డిసెంబర్11 నుంచి ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఎప్పుడైతే అమెరికాలో ప్రజలు కూడా వ్యాక్సిన్ కొనుగోలు చేసేలా మార్కెట్లో ఇది అందుబాటులో ఉంటుందో అప్పుడు ఈ ట్రావెల్ సంస్థ ఆసక్తి ఉన్న ప్రయాణికులను అమెరికా తీసుకెళుతుంది.
ముంబయ్ నుంచి న్యూయార్క్ తీసుకెళ్లి అక్కడ నాలుగు రోజులు, మూడు రాత్రులు ఉండే అవకాశం కల్పిస్తారు. దీంతో పాటు ఆ సమయంలో వారికి వ్యాక్సిన్ డోస్ ఇప్పిస్తారు. దీనికి సదరు ట్రావెల్ కంపెనీ ఒక్కో వ్యక్తికి 1,74,999 రూపాయలు ఛార్జీ చేయనున్నట్లు వెల్లడించింది. ముంబయ్ లో వాట్సప్ గ్రూపుల్లో ఈ మెసేజ్ పెద్ద ఎత్తున సర్కులేట్ అవుతున్నట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. ముంబయ్ కు చెందిన ట్రావెల్ సంస్థ ఎలాంటి అడ్వాన్స్ లేకుండా ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. అందుకు కొన్ని వివరాలు మాత్రం అందజేయాలని కోరుతోంది. అమెరికాలోని ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారమే తమ కస్టమర్లకు వ్యాక్సిన్ వేయించుతామని..ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు ఉండబోవని చెబుతోంది.