చర్చనీయాంశం అవుతున్న కెసీఆర్ వైఖరి
ఓ వైపు హుజూరాబాద్ లో మాత్రం రైతులను బిజెపి మోసం చేస్తోందని విమర్శలు
పెట్రోల్ ధరలపైనా విమర్శలు..బంద్ కు మాత్రం దూరం
అధికార టీఆర్ఎస్ వైఖరి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పాల్గొంటున్న మంత్రులు హరీష్ రావు, ఇతరులు కేంద్రంలోని బిజెపి తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి కేంద్రం రైతులపై అదనపు భారం మోపుతోందని తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు తాజాగా వ్యాఖ్యానించారు. రైతు బంధుతో తాము రైతులను ఆదుకుంటుంటే..బిజెపి మాత్రం రైతులను వేధిస్తుందని అన్నారు. మరి అలాంటి టీఆర్ఎస్ పార్టీ దేశ వ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కెఎం) మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా పిలుపునిచ్చిన భారత్ బంద్ పై మాత్రం మౌనంగా ఉంది. ఇప్పటివరకూ అధికారికంగా ఇందులో పాల్గొంటామని కానీ..లేదని కాని ప్రకటించలేదు. అదే ఏపీలో అధికార వైసీపీ భారత్ బంద్ కు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అందుకు వారు రైతు చట్టాలతోపాటు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించారు. అదే తెలంగాణ విషయానికి వస్తే మాత్రం బిజెపిపై ఉత్తుత్తి విమర్శలు చేయటంలో మాత్రం ముందుంటున్నారు కానీ కార్యాచరణ విషయానికి వచ్చేసరికి మాత్రం దూరంగా ఉంటున్నారు. దేశంలోని కీలక పార్టీలు అన్నీ కూడా భారత్ బంద్ కు మద్దతుగా ప్రకటనలు చేస్తున్నాయి.
కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిన తొలి రోజుల్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ ఆదేశాల మేరకు స్వయంగా మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు కూడా రోడ్లపైకి వచ్చి బంద్ లో పాల్గొన్నారు. తర్వాత మాత్రం కెసీఆర్ వ్యవసాయ చట్టాల విషయంలో తన వైఖరి మార్చుకున్నట్లు కన్పిస్తోంది. కేంద్ర చట్టాలను అమలు చేయాల్సిందే అంటూ కెసీఆర్ ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు. తర్వాత రాజకీయంగా కేంద్రంపై, బిజెపిపై విమర్శలకు వీటిని వాడుకుంటున్నారు తప్ప...ఈ విషయంలో అందరితో కలసి సాగటానికి మాత్రం ఆసక్తిచూపటం లేదు. దీంతో రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నట్లు బిజెపి, టీఆర్ఎస్ సాన్నిహిత్యమే దీనికి కారణమా అన్న చర్చ కూడా సాగుతోంది. బిజెపితో ఎప్పుడూ పెద్దగా ఘర్షణ కోరుకోని వైసీపీ బంద్ కు మద్దతు ఇస్తుంటే..బిజెపితో..కేంద్రంతో యుద్ధమే అని ప్రకటించిన కెసీఆర్ మౌనంగా ఉండటం కీలకంగా మారింది. ఈ వార్త పబ్లిష్ చేసే సమయం నాటికి అధికార టీఆర్ఎస్ భారత్ బంద్ పై ఎలాంటి ప్రకటనా చేయలేదు. రైతుల విషయంలో తాము తప్ప ఎవరూ చాంపియన్లు లేరు అని చెప్పుకునే పార్టీ అత్యంత కీలకమైన బంద్ కు దూరంగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది.