ఎన్టీఆర్ కు 'టీఆర్ఎస్ రాజ‌కీయ నివాళులు'

Update: 2022-05-28 04:54 GMT

రాజ‌కీయాల కోసం నేతలు ఏమైనా చేస్తార‌న‌టానికి ఇంత కంటే నిద‌ర్శ‌నం మ‌రొక‌టి ఉండ‌దు. ఇది టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కెసీఆర్ ఆమోదం లేకుండా జ‌రుగుతుందా?. అంటే ఆ పార్టీ వ్య‌వ‌హారం గురించి తెలిసిన వారెవ‌రైనా ఖచ్చితంగా నో అనే చెబుతారు. ఎన్టీఆర్ శ‌త జ‌యంతి సంద‌ర్భంగా హైద‌రాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో అరుదైన స‌న్నివేశాలు చోటు చేసుకున్నాయి. కెసీఆర్ కేబినెట్ లోని ఇద్ద‌రు మంత్రులు మ‌ల్లారెడ్డి, పువ్వాడ అజ‌య్ ల‌తోపాటు టీఆర్ఎస్ లోక్ స‌భ పార్టీ నాయ‌కుడు నామా నాగేశ్వ‌ర‌రావు, న‌గ‌రంలోని ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మోత్కుప‌ల్లి న‌ర్సింహులు, ఎమ్మెల్సీ తాతా మ‌ధు లు ఎన్టీఆర్ ఘాట్ లో దివంగ‌త నేత‌కు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కు ఎవ‌రైనా..ఎప్పుడైనా నివాళులు అర్పించ‌వ‌చ్చు. అందులో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వు. టీఆర్ఎస్ నేత‌ల జాబితాలో ఉన్న‌వారిలో ఒక్క పువ్వాడ అజ‌య్ మిన‌హా అంతా ఒక‌ప్ప‌టి టీడీపీ నేత‌లే. గ‌త కొన్నేళ్లుగా ఎన్టీఆర్ ఘాటువైపు క‌న్నెత్తి చూడ‌ని వీరంతా అక‌స్మాత్తుగా ఎన్టీఆర్ ఘాట్ ను సంద‌ర్శించ‌టం..ఎన్టీఆర్ కు నివాళులు అర్పించం అంతా రాజ‌కీయ కోణంలోనే సాగింద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

టీఆర్ఎస్ కు తెలంగాణ‌లో ఎదురుగాలి వీస్తోంద‌నే సంకేతాలు బ‌లంగా విన్పిస్తున్నాయి. ఈ త‌రుణంలో ఎన్టీఆర్ సామాజిక వ‌ర్గాన్ని ఆక‌ట్టుకోవ‌టంతోపాటు..తెలంగాణ ప్రాంతంలో ఉన్న టీడీపీ ఓటు బ్యాంకును త‌మ వైపు తిప్పుకునేందుకే కెసీఆర్ ఆదేశాల‌తో వీరు ఇది అంతా చేశార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. శుక్ర‌వారం నాడు అంతా స్వ‌యంగా సీఎం కెసీఆరే ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్ళి నివాళులు అర్పిస్తార‌ని వాట్స‌ప్ గ్రూపుల్లో భారీ ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. అయితే అందుకు భిన్నంగా కెసీఆర్ త‌న బ‌దులు ఆయ‌న టీమ్ ను పంపించారు. ఎన్టీఆర్ కు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తామ‌న్నారు నామా నాగేశ్వ‌ర‌రావు. ఎన్టీఆర్ పేద‌ల‌కు ఎన్నో ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టార‌ని పెట్టార‌ని నామా నాగేశ్వ‌ర‌రావు, మంత్రి మ‌ల్లారెడ్డిలు వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామం ఆస‌క్తిక‌ర చ‌ర్చకు దారితీసింది. స‌హ‌జంగా ఎవ‌రైనా నివాళులు అభిమానంతో అర్పిస్తారు..కానీ వీళ్ళు మాత్రం ఇప్పుడు రాజ‌కీయ అవ‌స‌రాల కోసం ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన‌ట్లు క‌న్పిస్తోంద‌నే అభిప్రాయం పార్టీ వ‌ర్గాల్లో వ్య‌క్తం అవుతోంది.

Tags:    

Similar News