దీనికి పైలట్ ప్రాజెక్టు ఎందుకు?
కరోనా లేనప్పుడూ దళితులకు మూడెకరాల భూమి పథకం హామీ అమలు చేయలేదు
హుజురాబాద్ ఎంపికతోనే అసలు రాజకీయం బట్టబయలు
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తన తొలి ఐదేళ్ల పాలనలో దళితులకు మూడెకరాల భూమి పథకం అమలు చేసింది అరకొరగానే. అసెంబ్లీలో ఎవరైనా ఈ అంశంపై ప్రశ్నిస్తే అసలు భూమి ఎక్కడ ఉంది..అందరికీ భూమి ఇవ్వటం సాధ్యం అవుతుందా అంటూ ప్రశ్నించారు. అప్పుడు కరోనా లేదు..ఇతర కష్టాలు కూడా పెద్దగా ఏమీలేవు. ఇప్పుడు కరోనాతో రాష్ట్ర ఆదాయంతోపాటు ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి కెసీఆర్ తన పాలనలో తొలిసారి అఖిలపక్ష సమావేశం పెట్టి దళిత కుటుంబాలకు నేరుగా పది లక్షల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. ఇలా ఎంపిక చేసిన వారి ఖాతాల్లో డబ్బులు వేసే పథకం ఏమైనా గొప్ప ఆవిష్కరణా?. దీనికి మళ్లీ పైలట్ ప్రాజెక్టు ఎందుకు?. ఇందులో పైలట్ గా చేయాల్సింది ఏమి ఉంది.. అర్హుల గుర్తింపే ప్రాతిపదిక కదా?. ఇప్పటికే ప్రభుత్వం దగ్గర సమస్త సమాచారం ఉంది. ఎవరి జాతకం ఏందో..ఎవరికేమి ఆస్తులు ఉన్నాయో సకల జనుల సర్వేలోనే తేల్చారు కదా. మరి ఇప్పుడు కొత్తగా ఏమి గుర్తిస్తారు. అర్హులైన దళితులకు..ఇతర వెనకబడినవర్గాలకు సాయం చేయటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ కేవలం రాజకీయ లక్ష్యాలతో ప్రభుత్వ ఖజానాను వాడుకోవటం అనేది చాలా కాలంగా సాగుతూనే ఉంది. ఇది ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఒక నియోజకవర్గానికి 1500 కోట్ల రూపాయల నుంచి 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామనటం ఏ మాత్రం సరికాదన్నారు. నిజంగా అంత డబ్బు పెడితే ప్రభుత్వమే అక్కడ ఓ భారీ పరిశ్రమనే ఏర్పాటు చేసి ఒక్క దళిత కుటుంబాలకే కాదు..అర్హులైన వారందరికీ కూడా ఉపాధి కల్పించవచ్చని ఆయన సూచించారు.
నేరుగా పది లక్షల రూపాయల నగదు పంపిణీ అనేది ఏ మాత్రం సరికాదని..అది ఉత్పాదక వ్యయంగా మారకపోగా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా దళితులకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమల శాఖ ద్వారా కార్లు, ఇతర వాహనాలను సమకూర్చారు. అవి కూడా కొంత మేర దుర్వినియోగం అయినా ఇది మెరుగైన పథకం అని..అలా కాకుండా మీకు పది లక్షల రూపాయలు ఇస్తాం మీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకోండి అనటం సరికాదని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పోనీ ఇచ్చే మొత్తాన్ని నిర్దేశిత లక్ష్యం కోసం ఉపయోగించాలనే నిబందన అయినాపెట్టాలని అలా కాకుండా ప్రజల డబ్బు ఏకంగా ఒక నియోజకవర్గంలోనే 1500 కోట్ల రూపాయల నుంచి 2000 కోట్ల రూపాయలు ఇచ్చి మీకు నచ్చినట్లు చేసుకోండి అని చెప్పటం సరికాదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రమంతటికీ 1200కోట్ల రూపాయలతో సాయం చేస్తామని చెప్పి..ఒక్క హుజూరాబాద్ కు మాత్రమే 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించటం అంటే ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట ఓ అధికారి తెలిపారు. అంటే ఓ ఉప ఎన్నిక గెలవటం కోసం చేయబోతున్న ఖర్చు అన్న విషయం ఎవరికైనా ఇట్టే అర్ధం అవుతుంది.