ముఠామేస్త్రి సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తమ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రినే తమ దగ్గరకు రప్పించుకుంటారు. ఇది ఎప్పుడో 28 సంవత్సరాల క్రితం సినిమా నాటి సంగతి. భరత్ అనే నేను సినిమాలో హీరో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏకంగా ఫైటింగ్స్ కే వెళతాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా వీరంతా సినిమాల్లో చేసే యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుంది. సినిమాల్లో అయితే ప్రధాని దగ్గర నుంచి ముఖ్యమంత్రుల వరకూ ఎవరినైనా సరే ఢీకొడతారు..ఎదుర్కొంటారు. ప్రజల కోసమే పోరాడుతున్నట్లు కలరింగ్ ఇస్తారు. కానీ తమ సొంత సమస్య దగ్గరకు వచ్చేసరికి మాత్రం ముఖ్యమంత్రిని..ప్రభుత్వాన్ని అందరూ కలసి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరటానికి నోరెత్తే సాహసం కూడా చేయటంలేదు. ఎంత పెద్ద హీరో అయినా..ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా ప్రదర్శించటానికి థియేటర్ లేకపోతే ఏమీ ఉండదు. పరిశ్రమలో అత్యంత కీలకమైన ఎగ్జిబిటర్లు ఇప్పుడు తీవ్ర సంక్షోంలో ఉన్నారని పరిశ్రమ ప్రముఖులు పదే పదే చెబుతున్నారు. అయినా సరే హీరోలు అందరూ మన రెమ్యునరేషన్ మనకు వస్తుంది..ఏమైనా సమస్యలు ఉంటే నిర్మాతలు..డిస్ట్రిబ్యూటర్లు చూసుకుంటారులే ఇది మన సమస్య కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. అంతే కానీ సినిమా పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్న ఎగ్జిబిటర్లు..థియేటర్లలో పనిచేసే సిబ్బంది కోణంలో వీరు ఏ మాత్రం వీరు ఆలోచించటం లేదు.
నిజంగా తెలుగు హీరోలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అందరూ ఒకతాటిపైకి వచ్చి టిక్కెట్ రేట్లను అడ్డగోలుగా కాకుండా హేతుబద్ధంగా నిర్ణయించాలని ఏపీ ప్రభుత్వానికి. ముఖ్యమంత్రికి లేఖ రాయవచ్చు. చివరకు సోషల్ మీడియా ద్వారా కూడా కోరవచ్చు. హీరోలు అందరూ కలసి అలా చేస్తే ప్రభుత్వంపై ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది. కానీ ఈ పని చేయటానికి కూడా హీరోలుగా చెప్పుకునే వారు ఎవరూ ముందుకు రావటంలేదని...ప్రభుత్వంతో మనకెందుకు ఘర్షణ..ఏదైనా సొంత అవసరాలు ఉంటే వెళ్లి సీఎంలతో మాట్లాడుకోవచ్చు కానీ పరిశ్రమ అవసరాలు..ఎగ్జిబిటర్ల సమస్యలు మనకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారని పరిశ్రమకు చెందిన ప్రముఖుడు ఒకరు వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో ఎక్కడాలేని సమస్య ఒక్క ఏపీలోనే ఎందుకొచ్చింది.
ఆయా రాష్ట్రాల్లో సినిమా టిక్కెట్ రేట్లు సహేతుకంగానే ఉన్నాయని..ఒక్క ఏపీలో ఉన్న సినిమా టిక్కెట్ ధరలు ఏ మాత్రం ఎగ్జిబిటర్లకు గిట్టుబాటు అయ్యేలా లేవన్నది పరిశ్రమ వర్గాల వాదన. ఈ కారణంగానే దేశంలో ఎక్కడాలేని సమస్య ఒక్క ఏపీలోనే తలెత్తిందని చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా కారణాలు ఏంటో తెలియదు కానీ...సినిమా టిక్కెట్ల విషయంలో పంతానికి పోతుంది. రేట్ల తగ్గింపు జీవోను సింగిల్ బెంచ్ కోర్టు సస్పెండ్ చేయగానే..ఆగమేఘాల మీద డివిజన్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్లింది. సినిమా టిక్కెట్ల అంశంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నా ఆయన చేసే వ్యాఖ్యలను ఏపీ సర్కారు రాజకీయ కోణంలోనే చూస్తోంది. టాలీవుడ్ హీరోలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ తో సంబంధం లేకుండా విడిగా అయినా ప్రభుత్వాన్ని ఈ సమస్య పరిష్కరించాల్సిందిగా కోరేవారని..కానీ అలా కాకుండా సినిమాల్లో మాత్రం పెద్ద పెద్ద సందేశాలు..పోరాటాలు చేసే హీరోలు తమ ఇంటి సమస్య పరిష్కారం విషయంలో మాత్రం హ్యాండ్సప్ అంటున్నారని ఓ నిర్మాత ఎద్దేవా చేశారు. వీళ్లు అంతా తెరమీద హీరోలే తప్ప..నిజ జీవితంలో కాదని..అలా అయితే సొంత పరిశ్రమ సమస్యలపై ఉమ్మడిగా పోరాటం చేసేవారని ఆయన వ్యాఖ్యానించారు.