టాలీవుడ్ కు ప్రేక్షకులు చూపిస్తున్న 'సినిమా ఇది'

Update: 2022-07-21 03:54 GMT

Full Viewరివ‌ర్స్ అవ‌టం అంటే ఇదే. ఇంత కాలం టాలీవుడ్ హీరోలు..నిర్మాత‌ల ఇష్టారాజ్యం న‌డిచింది. ప్ర‌భుత్వాల ద‌గ్గ‌ర పైర‌వీలు చేసుకుని టిక్కెట్ రేట్ల‌ను అడ్డ‌గోలుగా పెంచుకున్నారు. ఇక త‌మ‌కు తిరుగులేద‌నుకున్నారు. కానీ ఇప్పుడు ప్రేక్షకులే హీరోలు..నిర్మాత‌ల‌కు అస‌లు సినిమా చూపించ‌టం ప్రారంభించారు. దీంతో దిమ్మ‌తిర‌గ‌టం వారి వంతు అయింది. దీంతో ఇప్పుడు ఈ స‌మ‌స్య నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలా అని గిల‌గిల‌కొట్టుకుంటున్నారు. దారి దొర‌క్క దిక్కులు చూస్తున్నారు. ఒక‌ప్పుడు పెద్ద హీరోనా..చిన్న హీరోనా అన్న అంశంతో సంబంధం లేకుండా తొలి మూడు రోజులు అంటే శుక్ర‌, శ‌ని, ఆదివారాలు కొత్త సినిమాలు బాగా న‌డిచేవి. సోమ‌వారం నాటి బుకింగ్స్ మాత్ర‌మే సినిమా హిట్టా..ప‌ట్టా అన్న‌ది తేల్చేవి. ఇప్పుడు ఆ సీన్ కూడా పోయింది. ఏ మాత్రం బాగాలేద‌నే టాక్ వ‌చ్చినా అస‌లు ప్రేక్షకులు థియేట‌ర్ వైపు క‌న్నెత్తిచూడ‌టం లేదు. ఇందుకు తాజా సినిమాలే పెద్ద ఉదాహ‌ర‌ణ‌. రామ్, కృతి శెట్టిలు జంట‌గా న‌టించిన ద వారియ‌ర్ సినిమాకు ఇదే ప‌రిస్థితి ఎదురైంది. మ‌ల్లీప్లెక్స్ ల్లో ఈ సినిమా ఓపెనింగ్సే చాలా వీక్ గా ప్రారంభం అయ్యాయి. ఎందుకంటే ఈ సినిమా టిక్కెట్ ధ‌ర ట్యాక్స్ లేకుండా మ‌ల్టీప్లెక్స్ ల్లో ఏకంగా 295 రూపాయ‌లుగా పెట్టారు. ఆన్ లైన్ లో బుక్ చేస్తే ప‌న్నుల‌తో క‌లుపుకుని ఈ టిక్కెట్ ధ‌ర మ‌రింత ఎక్కువ అవుతుంది.

ఇప్పుడు నాగ‌చైత‌న్య‌, రాశీ ఖ‌న్నా జంట‌గా న‌టించిన థాంక్యూ సినిమాదీ అదే ప‌రిస్థితి. ఈ సినిమా టిక్కెట్ ధ‌ర‌ను 200 రూపాయ‌లుగా నిర్ణ‌యించారు. అయినా స‌రే మ‌ల్టీప్లెక్స్ ల్లో వీక్ ఓపెనింగ్సే ఉన్నాయి. తాజాగా నిర్మాత దిల్ రాజు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇక అన్ని సినిమాల‌కు మ‌ల్టీప్లెక్స్ ల్లో జీఎస్టీతో క‌లిపి 200 రూపాయ‌లు, సింగిల్ స్క్రీన్స్ లో 150 రూపాయ‌లుగా నిర్ణ‌యించాల‌ని ప్ర‌తిపాదించామ‌న్నారు. భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాల‌కు మాత్ర‌మే ధ‌ర‌ల పెంపు ఉంటుంద‌ని సంకేతం ఇచ్చారు. మ‌రి ప్రేక్ష కులు కూడా భారీ బ‌డ్జెట్, పెద్ద హీరోల సినిమాలే చూసుకుందాం అనుకుంటే చిన్న హీరోలు..చిన్న నిర్మాత‌ల ప‌రిస్థితి ఏమిటి అన్న చ‌ర్చ మొదలైంది. మ‌న మార్కెట్ కు సింగిల్ స్క్రీన్స్ లో ఒక టిక్కెట్ ధ‌ర 150 రూపాయ‌లు కూడా చాలా ఎక్క‌వ అనే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. మొత్తానికి టాలీవుడ్ పెద్ద‌లు అంద‌రూ క‌ల‌సి టిక్కెట్ రేట్ల‌ను అడ్డ‌గోలుగా పెంచేసి మొత్తం ప‌రిశ్ర‌మనే స‌మ‌స్య‌ల్లోకి నెట్టార‌ని కొంత మంది నిర్మాత‌లు మండిప‌డుతున్నారు. గ‌త కొంత కాలంగా పెరిగిన టిక్కెట్ రేట్ల దెబ్బ‌కు చాలా మంది సినిమా అభిమానులు కూడా థియేట‌ర్ల వైపు చూడ‌టం బాగా త‌గ్గించుకున్నారు.

Tags:    

Similar News